రాజ్యాధికార సాధనే టీఆర్పీ లక్ష్యం
టిఆర్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్

సూర్యాపేట: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ఆధ్వర్యంలో భువనగిరిలో నిర్వహించిన తొలి తెలంగాణ రాజ్యాధికార మహాసభను విజయవంతం చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం సూర్యపేట జిల్లా కేంద్రంలో టిఆర్పి పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో మెజారిటీ వర్గాలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రాజ్యాధికారాన్ని సాధించడమే టీఆర్పీ ప్రధాన లక్ష్యమని అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న నాయకత్వంలో పార్టీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుందని చెప్పారు.భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని, ఆధిపత్య వర్గాలు ఆక్రమించిన భూములను పేదలకు అందించేందుకు పార్టీ కార్యాచరణ చేపడుతుందని పేర్కొన్నారు. సభలో తీసుకున్న తీర్మానాలను గ్రామ గ్రామాన, గల్లీ గల్లీకి తీసుకెళ్లి ప్రజలను చైతన్యపరచాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం సాధించడంలో మహిళలు, యువత కీలక పాత్ర పోషించాలని, ప్రతి కుటుంబానికి టీఆర్పీ సిద్ధాంతాలను చేరవేయాలని సూచించారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు ఈ సభను తమ ఆత్మగౌరవ సభగా భావించి పెద్ద సంఖ్యలో పాల్గొనడం పార్టీకి మరింత బలాన్ని ఇచ్చిందన్నారు.
రాబోయే రోజుల్లో పార్టీ ప్రకటించిన లక్ష్యాలను ప్రజల సహకారంతో అమలు చేస్తామని, మెజారిటీ వర్గాలకు రాజ్యాధికారం సాధించే వరకు టీఆర్పీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు సభ విజయవంతానికి అందించిన సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భువనగిరి సభ భవిష్యత్తు పోరాటాలకు బహుజన రాజ్యాధికారానికి దిశానిర్దేశం చేస్తుందని అన్నారు. బహుజనుల రాజ్యాధికారం కొరకు సామాజిక న్యాయం, సాధికారత సాధించేందుకు బహుజనులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు నారాయణదాసు కవిత,ఆత్మకూరు ఎస్ మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, పెన్ పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య యాదవ్, సోషల్ మీడియా ఇన్ఛార్జి ఆరాల రమేష్ యాదవ్, జిల్లా యూత్ విభాగం అధ్యక్షుడు కోల కరుణాకర్, బొమ్మ గాని సైదులు, మామిడి శోభన్, బోడపట్ల మధు గౌడ్, లింగాల సైదులు, భారీ ఖాన్, వట్టె లింగరాజు, తదితరులు పాల్గొన్నారు.
