పోలియో చుక్కలు వేయిద్దాం.. చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడుదాం
వార్డు కౌన్సిలర్ మన్నెం అరుణ–మల్లేష్

ధర్మఘంట జూన్ 28,సూర్యాపేట: పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మునిసిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిక లక్ష్యాది ఆదేశానుసారం 24వ వార్డులో ఆదివారం పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్ మన్నెం అరుణ–మల్లేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మన్నెం అరుణ మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల బాధ్యత అని అన్నారు. “రెండు చుక్కల పోలియో వ్యాక్సిన్ ప్రతి చిన్నారి ఆరోగ్యానికి రక్షణ కవచం” అని పేర్కొన్నారు. పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా తల్లిదండ్రులు చొరవ చూపాలని కోరారు.పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ భాగస్వాములు కావాలని, ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో పల్స్ పోలియో కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తోందని, ఎలాంటి అపోహలకు తావివ్వకుండా సమీప పోలియో కేంద్రాలకు వెళ్లి పిల్లలకు చుక్కలు వేయించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బి. లక్ష్మమ్మ, నాగమణి, సంధ్యారాణి, రేణుక, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, తల్లిదండ్రులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
