పేదరికం నుంచి పీహెచ్‌డీ వరకు..

చదువే ఆయుధంగా, ఉద్యమమే మార్గంగా జంగిలి దర్శన్ ప్రస్థానం

కుటుంబ కష్టాలు, విద్యా ప్రయాణం, 15 ఏళ్ల విద్యార్థి ఉద్యమ ప్రస్థానం మధ్య ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ డాక్టరేట్

ధర్మఘంట , నవంబర్ 26, రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్ గ్రామానికి చెందిన జంగిలి దర్శన్ చిన్నతనం నుంచి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కష్టాలు, సామాజిక పరిస్థితులను ఎదుర్కొంటూ చదువుపై పట్టుదలతో ముందుకు సాగారు. పుస్తకాలు కొనుక్కోవడానికి సైతం డబ్బులు లేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు కూలి పనులు చేసి సంపాదించిన డబ్బుతో పుస్తకాలు, బట్టలు కొనిచ్చేవారు. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు చిన్నతనంలో మేకలు కాస్తూ కుటుంబ పరిస్థితులను అర్థం చేసుకున్నారు. ఆయన తండ్రి జంగిలి మైసయ్య గ్రామపంచాయతీ తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూ తన కుమారుడు ఉన్నత చదువులు చదవాలని ఎంతో తపించేవారు.

విద్యా ప్రయాణం:

జంగిలి దర్శన్ తన ప్రాథమిక విద్యను గ్రామంలో ప్రారంభించి, 5వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఇబ్రహీంపట్నం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుకున్నారు. అనంతరం ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేశారు. ఇబ్రహీంపట్నం వివేకానంద జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించారు. ఉన్నత విద్య కోసం హైదరాబాద్‌లోని నిజాం కళాశాలలో డిగ్రీ చదివి కళాశాలలో మొదటి స్థానం సాధించి గోల్డ్ మెడల్ అందుకున్నారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో తెలుగు సాహిత్యంలో ఎంఏ పూర్తి చేశారు. చదువుపై ఉన్న పట్టుదల, సాహిత్యంపై ఆసక్తి, పరిశోధన చేయాలనే సంకల్పంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాచ్యభాషల విభాగం తెలుగు శాఖలో పీహెచ్‌డీ పరిశోధన ప్రారంభించారు.

విద్యార్థి దశ నుంచే ఉద్యమ ప్రస్థానం:

విద్యార్థి దశ నుంచే సామాజిక సమస్యలపై అవగాహన పెంచుకుంటూ విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ సమయంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రచనలను విస్తృతంగా చదివి సామాజిక న్యాయం, సమానత్వం, విద్య ప్రాముఖ్యతపై అవగాహన పెంచుకున్నారు.

2011లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొని చలో అసెంబ్లీ, మిలియన్ మార్చ్ వంటి ఉద్యమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. 2012లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగమయ్యారు నిజాం కళాశాలలో డి.బి.ఎస్.ఏ. (దలిత్ బహుజన్ స్టూడెంట్స్ అసోసియేషన్ ) కళాశాల అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పోరాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు, హాస్టల్ సౌకర్యాలు, విద్యార్థుల హక్కుల కోసం ఉద్యమించారు. అనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి ఉద్యమాల్లోనూ కీలకంగా పాల్గొంటూ తన ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగించారు.

డా. నలిగంటి శరత్ చమార్ ప్రోత్సాహం.. బహుజన ఉద్యమ ప్రస్థానం:

2011లో డా. నలిగంటి శరత్ చమార్ పరిచయంతో దళిత బహుజన విద్యార్థి ఉద్యమంలో మరింత చురుకుగా పనిచేయడం ప్రారంభించారు. తనను విద్యార్థి నాయకుడిగా, సామాజిక కార్యకర్తగా తీర్చిదిద్దడంలో శరత్ చమార్ గారి ప్రోత్సాహం, మార్గదర్శకత్వం ఎంతో కీలకమని దర్శన్ పేర్కొంటారు. గత 15 సంవత్సరాలుగా దళిత బహుజన విద్యార్థుల హక్కులు, విద్యా అవకాశాలు, సామాజిక న్యాయం కోసం వివిధ ఉద్యమాల్లో పాల్గొంటూ డి.బి.ఎస్.ఏ. రాష్ట్ర కోఆర్డినేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పూలే, అంబేడ్కర్, కాన్షీరాం ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ బహుజన విద్యార్థుల ఐక్యత, విద్య, సామాజిక చైతన్యం, బహుజన రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా తన ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.

కుటుంబ బాధ్యతల మధ్య చదువు, ఉద్యమం:

కుటుంబ బాధ్యతల మధ్య చదువు, ఉద్యమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న తనకు కుటుంబ సభ్యుల అండదండలు ఎంతో బలాన్నిచ్చాయని జంగిలి దర్శన్ పేర్కొన్నారు. తన ప్రయాణంలో తోడుగా నిలిచిన బాబాయిలు జంగిలి డేవిడ్ రాజ్, జంగిలి దేవదాసు, అక్క మాధవి, చెల్లెలు శ్రీలత, తమ్ముడు దయాకర్, బావలు మెతరి కృష్ణ, పోలె రవి తదితర కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, ప్రేమ, ఆప్యాయత తనకు ఎంతో ధైర్యాన్నిచ్చాయని తెలిపారు.
ఒకవైపు విద్యార్థి ఉద్యమాల్లో చురుకుగా పాల్గొంటూ, మరోవైపు కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నత విద్యను కొనసాగించడం దర్శన్ జీవితంలో ఎంతో సవాలుతో కూడుకున్నది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు, తండ్రి అనారోగ్యం, కుటుంబ బాధ్యతల మధ్య తన చదువును, పరిశోధనను కొనసాగించారు.
కష్టాలు, ఆటంకాలు ఎదురైనా చదువును మధ్యలో ఆపకుండా తన లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదలతో ముందుకు సాగారు. విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొంటూనే పరిశోధనకు సమయం కేటాయిస్తూ పీహెచ్‌డీ పూర్తి చేయడం ఆయన ప్రయాణంలో ప్రత్యేకమైన అంశంగా నిలిచింది.

డా. కె. చంద్రశేఖర రావు పర్యవేక్షణలో ఆచార్య కొలకలూరి ఇనాక్ నవలలపై పరిశోధన:

ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాచ్యభాషల విభాగం తెలుగు శాఖలో “ఆచార్య కొలకలూరి ఇనాక్ నవలలు – సమగ్ర అధ్యయనం” అనే అంశంపై జంగిలి దర్శన్ పరిశోధన చేశారు. డా. కె. చంద్రశేఖర రావు పర్యవేక్షణలో ఈ పరిశోధనను కొనసాగించి, పీహెచ్‌డీ సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించారు.
ఈ పరిశోధనలో ఆచార్య కొలకలూరి ఇనాక్ రచించిన నవలల్లోని సామాజిక అంశాలు, పాత్రల చిత్రణ, కథన శైలి, భాషా వైవిధ్యం, దళిత జీవితాలు, సామాజిక అసమానతలు, మహిళల సమస్యలు, మానవీయ విలువలను సమగ్రంగా అధ్యయనం చేశారు.

పీహెచ్‌డీ పరిశోధనలో గురువులు, అధ్యాపకులు, విశ్వవిద్యాలయ అధికారుల ప్రోత్సాహం:

తన పరిశోధన ప్రయాణంలో పీహెచ్‌డీ చేయడానికి అవకాశం కల్పించి, వివిధ దశల్లో ప్రోత్సాహం అందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రామచంద్రం, మాజీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి, ఓఎస్‌డీ ప్రొఫెసర్ కృష్ణారావు, ప్రస్తుత వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి, ఓఎస్‌డీ ప్రొఫెసర్ జితేందర్ నాయక్‌లకు జంగిలి దర్శన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే పరిశోధనలో నిరంతరం మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాచ్యభాషల విభాగం డీన్ ప్రొఫెసర్ అజ్మీరా సిల్మా నాయక్, ప్రొఫెసర్ రాజరత్నం, ప్రస్తుత పాఠ్య ప్రణాళిక మండలి అధ్యక్షులు డా. ప్రేమ్ కుమార్, డా. కిషన్, డా. లలిత తదితర అధ్యాపకులకు జంగిలి దర్శన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే తనకు వెన్నుముకగా ఉండి, పరిశోధనను పర్యవేక్షిస్తూ అనునిత్యం అనేక సలహాలు, సూచనలు ఇస్తూ, అత్యంత ప్రేమ, వాత్సల్యాన్ని పంచుతున్న తన గురువు, బహుముఖ ప్రతిభాశాలి, పరిశోధన పర్యవేక్షకులు డా. కె. చంద్రశేఖర రావు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తల్లిదండ్రులకు పీహెచ్‌డీ డాక్టరేట్ అంకితం:

తన విద్యా ప్రయాణంలో ఎన్నో కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా, చదువుపై తనకున్న పట్టుదలకు తోడుగా నిలిచి, నిరంతరం ప్రోత్సహించిన తల్లిదండ్రులు జంగిలి మైసమ్మ, జంగిలి మైసయ్యల కృషి, త్యాగం, ప్రోత్సాహం ఎంతో గొప్పవని జంగిలి దర్శన్ పేర్కొన్నారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహం, వారి కష్టమే తన ఈ విజయానికి ప్రధాన కారణమని, తాను సాధించిన పీహెచ్‌డీ డాక్టరేట్‌ను తన తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నట్లు తెలిపారు.

తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు:

పీహెచ్‌డీ వరకు సాగిన తన విద్యా ప్రయాణంలో, విద్యార్థి ఉద్యమ ప్రస్థానంలో అడుగడుగునా తోడుగా నిలిచి, ప్రోత్సాహం అందించిన ఆత్మీయులు, అన్నలు, తమ్ముళ్లు, ఉద్యమ సహచరులు, ఉద్యమకారులు, వివిధ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, మేధావులు, డి.బి.ఎస్.ఏ. విద్యార్థి బృందం, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, స్నేహితులు మరియు శ్రేయోభిలాషులందరికీ జంగిలి దర్శన్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తనపై ప్రేమ, అభిమానంతో అండగా నిలిచి, తన విజయాన్ని తమ విజయంగా భావించి శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విజయం తన ఒక్కరి విజయమే కాకుండా, తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరి ప్రోత్సాహం, సహకారం, ప్రేమకు ప్రతిఫలమని పేర్కొన్నారు.

యువతకు స్ఫూర్తిదాయకమైన ప్రస్థానం:

పేదరికం తన లక్ష్యాలకు అడ్డుకాలేదని, కష్టాలు తన ప్రయాణాన్ని ఆపలేకపోయాయని నిరూపించిన జంగిలి దర్శన్ ప్రస్థానం విద్యార్థులకు, యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. చదువును ఆయుధంగా, ఉద్యమాన్ని జీవిత మార్గంగా ఎంచుకొని, సామాజిక న్యాయం, బహుజన అభ్యున్నతి లక్ష్యంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *