సూర్యాపేటలో కాంగ్రెస్ బలమైన శక్తి
వచ్చే ఎన్నికల్లో మూడు రంగుల జెండా ఎగురవేయడం లక్ష్యం
రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

ధర్మఘంట జులై 05,సూర్యాపేట: సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఉందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా అందరూ సమష్టిగా పనిచేయాలని ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి పిలుపునిచ్చారు.
తనను మర్యాదపూర్వకంగా కలిసిన సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు వెలుగు వెంకన్న, సూర్యాపేట మండల అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, చివ్వెంల మండల అధ్యక్షుడు ధారావత్ వీరన్న నాయక్, ఆత్మకూర్ (ఎస్) మండల అధ్యక్షుడు ముసుగు రామచంద్రారెడ్డి, పెన్ పహాడ్ మండల అధ్యక్షుడు తుముల సురేష్రావు లతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ తాత, ముత్తాతల కాలం నుంచి తన తండ్రితో పాటు నాలుగు తరాలుగా కాంగ్రెస్ పార్టీకే సేవ చేస్తున్నామని, పార్టీ బలోపేతం కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో చిన్నచిన్న పొరపాట్ల వల్ల సీటు కోల్పోయామని, అనంతరం జరిగిన ఎంపీ, ఎమ్మెల్సీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు తిరుగులేని మెజారిటీ ఇచ్చారని గుర్తుచేశారు. రాబోయే ఎన్నికల్లో సూర్యాపేటలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే ప్రతి కార్యకర్త లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.ఇటీవల ముఖ్యమంత్రి, మంత్రులు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, “తులసివనంలో గంజాయి మొక్క ఉన్నట్లయితే దానిని కూకటి వేళ్లతో పీకేయాల్సిన బాధ్యత నాదే” అని అన్నారు.నియోజకవర్గంలో సీనియర్ నాయకులు, సమర్థవంతంగా పనిచేసే నాయకులతో సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో తాను ఎమ్మెల్యేగా విజయం సాధిస్తాననే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ప్రస్తుతం సర్వే, ఎన్యూమరేషన్ ప్రక్రియ కొనసాగుతోందని, వచ్చే నెల రోజుల పాటు పార్టీ ఇచ్చే ప్రతి ఆదేశాన్ని నాయకులు, కార్యకర్తలు తూచా తప్పకుండా అమలు చేయాలని సూచించారు.పదవుల కోసం పలువురు సీనియర్ నాయకులు కూడా పోటీ పడ్డారని, పదవులు రాలేదని ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇంకా అనేక అవకాశాలు ఉన్నాయని, పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తించి తగిన ప్రాధాన్యం కల్పించే బాధ్యత తనదేనని రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
