ఆర్థిక క్రమశిక్షణ నేర్పడంలో ….తల్లిదండ్రులదే కీలక బాధ్యత.
వేసవి సెలవులలో…
ఇంటి వద్ద ఆర్థిక పాఠాలు నేర్పాలి.
ఆర్దిక నైపుణ్యాలతోనే ఆనందకరమైన జీవితం…..
ఆర్దిక నైపుణ్యాలతోనే ఆనందకరమైన జీవితం…..
బాల్యం నుండే డబ్బు విలువ తెలుసుకోవాలి….
వేసవి సెలవులలో
విద్యార్థులకు మనీ మేనేజ్మెంట్ అవగాహన కల్పించాలి…..
బడుగుల సైదులు
సామాజిక ఆర్థిక విశ్లేషకులు, కోదాడ.

విద్యార్థులకు వేసవి సెలవులు సమయాన్ని సద్వినియోగం చేసేందుకు తల్లిదండ్రులు, పేరెంట్స్ పిల్లలకు మ్యూజిక్ డ్రాయింగ్ స్విమ్మింగ్ కంప్యూటర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ తో పాటు.. తప్పనిసరిగా ఆర్థిక అక్షరాస్యత, మనీ మేనేజ్మెంట్, ఆ ర్దిక విషయాల అవగాహన పాఠాలు నేర్పడం చాలా కీలకమైనది. విద్యాలయాలలో నేర్పే పుస్తక పాఠాలు కంటే ఇంటి వద్ద ప్రత్యక్ష అనుభవాలు అనుభూతులు ద్వారా తల్లిదండ్రులు విద్యార్థులకు నేర్పే “ఆర్థిక పాఠాలు వారి భవిష్యత్తు ఆర్థిక క్రమశిక్షణకు పునాదులు” వేస్తాయి. నేటి ఆధునిక కాలంలో మూడవ తరగతి విద్యార్థి దశనుండే డబ్బుకు సంబంధించి ప్రాథమిక విషయాల అవగాహన కల్పించడం , ఫైనాన్స్ సెల్ స్కిల్స్ నాలెడ్జ్ అత్యంత ఆవశ్యకము. మార్కెట్ ఆటుపోటులను తట్టుకొని ఆర్థికంగా స్థిరపడి ఆనందకరమైన జీవితాన్ని అనుభవించడానికి బాల్యం నుండే డబ్బు కు సంబంధించిన విషయాలపై స్పష్టమైన అవగాహన కల్పించవలసిన బాధ్యతను ఇంటి వద్దనే సమయ సందర్భాన్ని బట్టి తల్లిదండ్రులు నిర్వహించాలని ప్రముఖ సామాజిక ఆర్థిక విశ్లేషకులు బడుగుల సైదులు తెలియజేసినారు.
ఫైనాన్సియల్ లిటరసీ, ఆర్థిక అక్షరాస్యత అంటే ఏమిటి? :
డబ్బు అంటే ఏమిటి, డబ్బు రూపాలు, మనిషి జీవితంలో డబ్బు ప్రాధాన్యత, డబ్బు సంపాదన, ఖర్చులు, పొదుపులు, అప్పులు వడ్డీలు పెట్టుబడులు, డబ్బు ప్లానింగ్, బ్యాంకింగ్, డిజిటల్ మనీ సంబంధించిన ప్రాథమిక విషయాల పట్ల అవగాహన కల్పించడమే.
మనిషి- మనీ :
మనీ అంటే కరెన్సీ నోట్లు నాణేలు డిజిటల్ మనీ. మనిషి అంటే కోరికలు తో కూడిన నిరంతర కార్యక్రమాలు. మనిషికి ప్రతినిత్యం కలిగే కోరికలు తీర్చుకోవడానికి అవసరమైన వస్తువులను పొందడానికి డబ్బు అవసరం. మనిషికి కలిగే కోరికలు అవసరాలు సౌకర్యాలు విలాసాలు గా ఉంటాయి. విద్యార్థులకు అవసరాలు సౌకర్యాలు విలాసాలు మధ్య ఉన్న తేడాను స్పష్టంగా, సులభంగా వివరించాలి. బడికి వెళ్లే విద్యార్థికి పుస్తకం పెన్ను బ్యాగు అవసరం, మూడు నాలుగు రకాల పెన్నులు రెండు రకాల బ్యాగులు సౌకర్యం, బ్రాండెడ్ బ్యాగులు, పెన్నులు విలాసం .. తల్లిదండ్రులు తమ దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు విద్యార్థులకు బాల్యం నుండే గ్రహించేలా వివరించి చెప్పాలి. మార్కెట్ కి వెళ్ళినప్పుడు వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఏవి అవసరాలు సౌకర్యాలు వినాశాలు వివరించితే విచక్షణతో ఖర్చు చేసే జ్ఞానం బాల్యం నుండి అలబడుతుంది. వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు వాటి నాణ్యత, ఎం ఆర్ పి ధరలు, బేరమాడే శక్తి సామర్థ్యాలను అలవాటు చేయాలి.
డబ్బు ప్లానింగ్- బడ్జెట్ :
డబ్బు ఎలా వస్తుంది, ఆదాయం ఖర్చులు, డబ్బు ప్లానింగ్ సంబంధించిన విషయాలు .. పిల్లలకు స్పష్టంగా వివరించడం అత్యవసరం. పనిచేయడం, ఉద్యోగం, వృత్తి , ఇతర కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా డబ్బులు వస్తాయి, వాటిలో కొంత భాగం దాచుకోవడం పొదుపు చేయడం, చిన్నతనం నుండే విద్యార్థులకు మట్టి ప్లాస్టిక్ తో చేసిన కిడ్డీ బ్యాంకులను ఇంటి వద్ద ఏర్పాటు చేసి వారి పాకెట్ మనీ నుండి కొంత డబ్బును ప్రతిరోజు అందులో దాచుకునేటట్లు పొదుపు అలవాటును నేర్పాలి. పుట్టినరోజు, ప్రత్యేక వేడుకలు సందర్భంగా చేసే ఖర్చులకు ముందు రోజుల నుండి కొంత దాచుకోవడం, డబ్బును వృధా చేయకుండా ఖర్చులను నియంత్రించడం, నేర్పాలి. డబ్బు ఎలా వస్తుంది ఎంత డబ్బు ఉన్నది వేటికి ఖర్చు చేయాలి సంబంధించిన ప్లానింగ్ బడ్జెట్ తయారీ అలవాటు చేయాలి.
బ్యాంకింగ్ అలవాట్లు:
తల్లిదండ్రులు వీలు చేసుకుని తమ పిల్లలను బ్యాంకులోకి తీసుకుని వెళ్లాలి అక్కడ జరిగే కార్యకలాపాలు డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయడం బ్యాంకు నుండి డబ్బులు తీసుకోవడం ప్రత్యక్షంగా అవగాహన కల్పించాలి. నెట్ బ్యాంకింగ్ ఫోన్ పే గూగుల్ పే లాంటి చెల్లింపులను ఏటీఎం నుండి డ్రా చేయడం డిపాజిట్ చేయడం బ్యాంకులలో చిన్నపిల్లలకు ఎలాంటి సేవింగ్స్ ఖాతాలు ఉన్నాయో వివరించి నేర్పితే, బాల్యం నుండే మనీ ట్రాన్సాక్షన్స్ సామర్ధ్యాలు పెరుగుతాయి. క్రెడిట్ కార్డులు వాడకం, సైబర్ నేరాలు, డిజిటల్ నెట్ బ్యాంకింగ్ అవగాహన, జాగ్రత్తలను తమ పిల్లలకు నేర్పాలి.
అప్పులు చేయడం వడ్డీలు కట్టడం:
తమ ఆదాయాలకు మించి ఖర్చులు చేయవలసిన సందర్భాలలో అప్పు చేయడం, దాని పైన వడ్డీలు కట్టడం కలిగే ఇబ్బందులను, నష్టాలు కష్టాలను వివరించితే. . భవిష్యత్తులో అప్పులు వడ్డీలు పట్ల విచక్షణతో వ్యవహరించే సామర్థ్యం పెరుగుతుంది. అప్పు ముప్పుల నుండి తప్పించుకోవటానికి అనవసరమైన ఆర్థిక ఖర్చులను వాయిదా వేసుకునే పద్ధతులను అవలంబించే సూత్రాలను నేర్పవచ్చు.
పెట్టుబడులు-భవిష్యత్తు భద్రత అభివృద్ధి:
డబ్బును పొదుపు చేయడంతో పాటే దాని వృద్ధి చేయడము నేర్పించాలి. స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి వారి వయసుకు తగ్గట్లుగా ఉదాహరణలతో వివరించాలి. వారు ఇష్టంగా తినే చాక్లెట్లు వాడే వస్తువులను తయారు చేసే కంపెనీలు షేర్లు అని చెబుతూ వాటిలో పెట్టుబడి పెడితే లాభాలు ఎలా వస్తాయో ఆసక్తికరంగా చెప్పాలి ముఖ్యంగా చిన్న వయసులోనే పెట్టుబడి పట్ల ఆకర్షితులవుతారు. భవిష్యత్తులో ఆర్థిక భద్రత కోసం ఇన్సూరెన్స్ చేయడం, అత్యవసర నిధి ఏర్పాటు చేయడం వంటివి ప్రాథమిక విషయ పరిజ్ఞానం నేర్పాలి.
డబ్బు వలన ఏర్పడే అంతరాలు- సామాజిక బాధ్యత:
మనిషి తమ కోర్కెలు, అవసరాలు తీర్చుకోవటానికి కావలసినంత పరిమాణంలో డబ్బు లేకపోవడం పేదరికం, తమ అవసరాలకు మించి అధికంగా డబ్బును కలిగి ఉండటం ధనవంతులుగా , ప్రజల మధ్య ఏర్పడే పేద, గొప్ప మధ్య అంతరాలను తెలియజెప్పాలి. శ్రమకు తగ్గ ప్రతిఫలం పొందడం నైతికత, శ్రమ చేయకుండా ఇతరుల నుండి అక్రమంగా డబ్బును పొందడం అనైతికమని వివరించాలి. పిల్లలు చిన్న చిన్న పనుల్లో సాయం చేసినప్పుడు శ్రమతత్వం అలవడుతుంది సందర్భాలలో ప్రోత్సాహ బహుమతులు ఇచ్చి ప్రోత్సహించాలి శ్రమకు సంపాదనకు మధ్య ఉన్న సంబంధాన్ని బలంగా నాటుకుంటుంది. తమ దగ్గర ఉన్న డబ్బులు కొంత ఇతరులకు సాయం చేయడం, కొంత డబ్బును ఖర్చు చేసి పుట్టినరోజు శుభకార్యాలు సందర్భాలలో బడి వద్ద ఇంటి వద్ద మొక్కలు నాటడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి మన సంపాదనలో కొంత డబ్బును ఖర్చు చేయడం సామాజిక బాధ్యతగా అలవాటు చేయాలి.
తల్లిదండ్రుల కీలక బాధ్యత :
తమ పిల్లలకు ఆదాయ ఖర్చుల స్థితిగతులు ఆర్థిక ఇబ్బందులను తెలియజెప్పడానికి సంకోచించకూడదు. కుటుంబ ఆర్థిక విషయాలను విద్యార్థులకు అవసరమైన మేరకు వివరించి చెప్పాలి. తమ ఆదాయ స్థాయిలకు మించి అతిగా వృధాఖర్చులు, దుబారాలు చేయటం వల్ల కలిగే ప్రమాదాలను ఇబ్బందులను, నష్టాలను కుటుంబ బడ్జెట్ ప్లానింగ్ లో పిల్లలను భాగస్వామ్యం చేయాలి అప్పుడే బాధ్యతాయుతమైన ఆర్థిక క్రమశిక్షణ బాల్యం నుండే అలబడుతుంది. మనిషి జీవితంలో డబ్బు అవసరం దాని విలువ, సంపాదన , వినియోగం, పొదుపు , పెట్టుబడి తదితర విషయాల పట్ల వేసవి సెలవులలో ఇంటి వద్దనే ఆచరణాత్మకంగా ప్రత్యక్ష అనుభవాలతో పిల్లలకు నేర్పించడం వలన భవిష్యత్తులో స్వాలంబనతో కూడిన ఆర్థిక క్రమశిక్షణ అలవడి అప్పుల ఊబిలో పడకుండా డబ్బును సద్వినియోగం చేయగలిగే ఆర్థిక సామర్థ్యం మనీ మేనేజ్మెంట్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. పాఠశాల లో నుండి తరగతి గదిలో నేర్చుకునే పాఠ్యపుస్తకాల ఆర్థిక పరిజ్ఞానాన్ని తోపాటు ఇంటి వద్ద ప్రత్యక్షంగా కుటుంబ ఆర్థిక స్థితిగతులను అర్థం చేసుకొని ఆచరణాత్మకంగా వ్యవహరించగల సామర్థ్యం తోటే భవిష్యత్ ఆర్థిక క్రమశిక్షణకు బాల్యం నుండి పునాదులు గట్టి పడతాయి.
