
హన్మకొండలో వెలుగులోకి వచ్చిన భూఆక్రమణల వ్యవహారం
1999లో 320గా ఉన్న సర్వే నంబర్.., 2016 నాటికి 306గా ఎలా మారింది అనేది బాధితుల సూటి ప్రశ్న?
అధికార దుర్వినియోగం, సబ్ రిజిస్ట్రార్ ల నిర్లక్ష్యం, రెవెన్యూ శాఖలోని లోపాలు, అక్రమ పత్రాలతో ఆక్రమణలు?
2016లో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగిన రిజిస్ట్రేషన్ లో ఏకంగా సర్వే నంబర్లు తారుమారు.
ధర్మఘంట, ఫిబ్రవరి 12, వరంగల్: వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని హనుమకొండ ప్రాంతంలో ఓ రిటైర్డ్ ఆర్డీఓ (డిప్యూటీ కలెక్టర్ హోదాలో పనిచేసి పదవీ విరమణ చేసిన అధికారి) కి సంబంధించిన భూ అక్రమాల వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
హంటర్ రోడ్డు పరిధిలోని విలువైన భూములను లక్ష్యంగా చేసుకుని, తనకు ఉన్న రెవెన్యూ అనుభవం, అధికార పరిచయాలు, పలుకుబడిని ఆసరాగా చేసుకుని పట్టా భూములను కుటుంబ సభ్యుల పేర్లపై ఏకంగా సర్వే నంబరు మార్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు.ఈ క్రమంలో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు వాపోతున్నారు.
బాధితుల ఆరోపణల ప్రకారం, మధ్యవర్తిగా వ్యవహరించిన “చారి” అనే వ్యక్తి, పక్కవారి భూమిని కబ్జా చేయాలనే ఉద్దేశంతో సర్వే నంబర్ మార్పు చేసినట్లు తెలుస్తోంది.
దీనికి రిటైర్డ్ ఆర్డీఓ స్థాయి అధికారి సహకరించారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 1999 సంవత్సరానికి చెందిన లింక్ డాక్యుమెంట్‌లో నమోదైన సర్వే నంబర్ 320 స్పష్టంగా ఉన్నప్పటికీ, 2016లో జరిగిన లావాదేవీలలో అదే భూమికి వేరే సర్వే నంబర్ 306 చూపించడం అనుమానాలకు తావిస్తోంది.
అప్పటి సబ్ రిజిస్ట్రార్ పాత్రపై అనేక అనుమానాలు?
“టాస్క్ఫోర్స్ పోలీసులు” లోతుగా విచారణ జరిపితే పెద్ద, పెద్ద అధికారులు బయటకు వచ్చే అవకాశం ఉంది. సర్వే నంబర్లు మార్చి అక్రమంగా భూములను స్వాధీనం చేసుకున్నట్లు కూడా బాధితులు ఆరోపణలు చేస్తున్నారు. తాను విక్రయించిన భూమికి సంబంధం లేని వేరే సర్వే నంబర్లలో ఉన్న స్థలాలపై అక్రమంగా ప్రవేశించి, అక్కడ ఇప్పటికే ఉన్న కాంపౌండ్ వాల్స్ పై తన పేరుతో బోర్డులు ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు.
తనకు ఉన్న పలుకుబడితో ప్రభుత్వ అధికారులను మేనేజ్ చేస్తూ, రాజకీయ అండతో ఈ భూ అక్రమాలకు పాల్పడుతున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, డాక్యుమెంట్లలో ఉన్న సర్వే నంబర్ల తేడాలు అనుమానాలకు తావిస్తున్నాయి.
బాధితుల వాదన ప్రకారం, 2016లో చేసిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో సర్వే నంబర్ 306గా ఉండగా, అందుకు లింక్ డాక్యుమెంట్‌గా చూపినది 1999 నాటి పత్రం. అయితే ఆ లింక్ డాక్యుమెంట్‌లో మాత్రం సర్వే నంబర్ 320గా ఉండటం గమనార్హం.
ఇదేంది ఏకంగా సర్వే నంబర్ వేరు వేరు ఉండటం ఎలా సాధ్యం?
అప్పట్లో భుట్టో.. ఇప్పుడు ముషారఫ్.. అన్నట్లు.. 1999లో 320గా ఉన్న సర్వే నంబర్ 2016లో 306 ఎలా అయింది అనేది ప్రశ్నార్థకం?
1999లో 320గా ఉన్న సర్వే నంబర్, 2016 నాటికి 306గా ఎలా మారిందన్న అంశంపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత అధికారులదేనని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
అధికార దుర్వినియోగం, రెవెన్యూ శాఖలోని లోపాలు, అక్రమ పత్రాలు కలిసి ఈ వ్యవహారానికి దారితీసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో బాధితులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు:
రిటైర్డ్ ఆర్డీఓ స్థాయి అధికారి విషయంలో సర్వే నంబర్ల మార్పు ఎలా జరిగింది?
పేదల భూములకు రక్షణ ఎక్కడ?
పవర్ లేదు ఏమో.. కానీ పైసలు ఉన్నాయి.. ఎవరు ఏమి చేసినా తగ్గేదెలా అంటున్న రిటైర్ ఆర్డీఓ ఎవరు?
“సుబేదారి” పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం..?
ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
