ఆమె జీవితమే ఒక అడ్వెంచర్

(నేడు డాక్టర్ విమలాబాయి 11వ, వర్ధంతి సందర్భంగా)
ధర్మఘంట, మార్చి 26, హైదరాబాద్ : సూక్తులు, నిర్వచనాలు దేశకాల పరిస్థితులను బట్టి మారుతుంటాయి. కానీ ఒక వ్యక్తి ఆచరించి చూపిన ప్రభావం వీటన్నిటికన్నా లోతైనది. నీతి బోధలుకన్నా ఆచరించి స్ఫూర్తిని నింపిన ఉత్తేజకరమైన మహిళ డాక్టర్ విమలాబాయి.
కొంతమంది చరిత్రలను వెలికితీయటం వలన వచ్చే తరాలు ఎంతో కొంత నేర్చుకుంటారు. అలాంటి చరిత్రలు గుర్తించకపోవటం, రాయకపోవటం వారి చరిత్రను కనుమరుగు చేయటమే అవుతుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలను చాకచక్యంగా, ఛాలెంజ్ ఎదుర్కొని ఒక ఆత్మగౌరవ జండాలా నిలబడ్డారు విమలాబాయి. కొంతమంది ఆదిపత్య ప్రగతిశీల మహిళలు వేదికల మీద పెద్దపెద్ద మాటలు చెబుతారు. కానీ ఆచరించి నిలబడడం అంత సులభంకాదు.
విమలాబాయి మహిళా ఉద్యమాల్లో పనిచేయకపోవచ్చు, కానీ ఆచరించిచూపిన అనేక అంశాలు ఎంతో స్ఫూర్తిగా
నిలుస్తాయి. ఆమెకు వ్యక్తిగతం, సామాజికం అనే పరిమితులు లేవు.
విమలాబాయి 1922 నవంబర్ 10న కర్నాటక రాష్ట్రం ఉడిపి జిల్లాలో మంగులూరుకి 60 కి.మీ. దూరంలో ఉన్న కార్కళ అనే పట్టణంలో జన్మించారు. కార్కళ జైనులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ అనేక హిందూ దేవాలయాలు, జైన బసదీలు, మసీదులు ఉన్నాయి. అనంతపద్మనాభ దేవాలయం, సెయింట్ లారెన్స్ చర్చి ప్రసిద్ధిగాంచిన గోమఠేశ్వర బాహుబలి విగ్రహం మొదలైన సాంస్కృతిక చిహ్నాలకు కార్కళ పట్టణం ప్రసిద్ధి.
విమలాబాయిది సనాతన కామత్ బ్రాహ్మణ కుటుంబం. నలుగురు అన్నదమ్ములు, నలుగురు అక్కచెల్లెళ్ళు గల పెద్ద కుటుంబం. ప్రముఖ పారిశ్రామిక వేత్త దివంగత దేవానంద్ కామత్ విమలాబాయి సోదరుడు. ఆమె ఇంటర్మీడియట్ వరకు కార్కళలోనే చదివారు. తర్వాత మద్రాస్ మెడికల్ కాలేజీలో చేరి 1948లో మెడిసిన్లో పట్టభద్రులయ్యారు. కార్కళ ప్రాంతం నుండి తొలితరం మహిళా డాక్టర్ విమలాబాయి. ఆమె మొదట పుత్తూరు, లేడీగోష్బన్ హాస్పిటల్స్లో వివిధ హోదాలలో సేవలందించారు. ఉడిపి, మంగులూరు తర్వాత మద్రాసులో డాక్టర్గా పనిచేస్తున్న క్రమంలో ఆమె జీవితాన్ని ప్రభావితంచేసి మలుపుతిప్పిన మానవీయ సంఘటన జరిగింది. అది 1953లో కత్తి చంద్రయ్యతో కులాంతర, రాష్ట్రాంతర వివాహం జరగడం. సనాతన బ్రాహ్మణ కట్టుబాట్లను ఛేదించి బ్రాహ్మణీయ వర్ణ, ధర్మ, భావనను ధిక్కరించి అట్టడుగు దళిత మాదిగ సామాజిక వర్గం నుండి వచ్చిన వ్యక్తిని వివాహం చేసుకోవడం ఆరోజుల్లోనే కాదు ఇప్పటికీ ఒక సామాజిక విప్లవం.
విమలాబాయి ప్రగతిశీలంగా ప్రతిదీ ఎంతో ప్రోగ్రస్సీవ్ గా ఆచరించి చూపారు. కత్తి చంద్రయ్య ఆంధ్రప్రదేశ్ ప్రకాశంజిల్లా (అప్పటి గుంటూరు జిల్లా) నుండి ఎంతో కష్టపడి మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకొని అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వంలో మధురై జిల్లా, ఉసిలంపట్టి ఆర్డీఓగా నియమించబడ్డారు. వీరిది కూడా విమలాబాయి కుటుంబంలా చాలా పెద్దకుటుంబం. విమలాబాయి కులాంతర వివాహం తర్వాత వారి కుటుంబంలో కొన్ని ఒడిదుడుకులను ఆమె ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ ధైర్యంగా నిలబడింది. కత్తి చంద్రయ్యతో నడిచింది. ఆయనను నడిపించింది. చంద్రయ్య కుటుంబంతో కరచాలనం చేసింది. ఆమె బ్రాహ్మణ స్వభావం ఎక్కడా ప్రదర్శించలేదు.
ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1971 జనవరి 23న కత్తి చంద్రయ్య తన సొంత జిల్లా ప్రకాశం కలెక్టర్గా నియమించబడ్డాడు. దేశంలోనే సొంత జిల్లాకి కలెక్టర్ కావటం ఎక్కడా జరగలేదు. విమలాబాయి అప్పుడు ఒంగోలులో మహిళా మండలి భవన నిర్మాణానికి చొరవచూపి ప్రారంభించారు. అదే సమయంలో మద్రాసులో ఎండి కోర్సు పూర్తి చేశారు. చంద్రయ్య ఫిషరీస్ డైరెక్టర్గా హైదరాబాద్ కి బదిలీ కాబడ్డారు. అప్పుడు విమలాబాయి ఉస్మానియా హాస్పిటల్లో కొంతకాలం గైనకాలజిస్ట్ చేసి అనతికాలంలోనే గాంధీ హాస్పిటల్లో ప్రొఫెసర్ అయ్యారు. తక్కువ కాలంలోనే విమలాబాయి ప్రముఖ వైద్యురాలిగా పేరుగడించారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం 1947లో ఇండియన్ అసిసోయేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్స్,
వెనిరియాలజిస్ట్స్ (ఎ.ఐ.డి.వి.ఎల్.) సంస్థ ఏర్పడింది. దీని సభ్యులు భారతదేశంలోని నలుమూలల నుండి వైద్యరంగంలో విశిష్టమైన వ్యక్తులుంటారు. 1972లో మద్రాసులో సిల్వర్ జూబ్లీ వేడుకలు జరిగాయి. 1973 లో ఆంధ్ర ప్రదేశ్ శాఖ 100 మంది సభ్యులతో ఏర్పడింది. 1973 జూలై 28న సికింద్రాబాద్లోని గాంధీ హాస్పిటల్లో మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేష్పయ్ ప్రారంభించారు. గాంధీహాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ ఎస్.అర్.వి. స్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రొఫెసర్ ఎమిరిటస్ డాక్టర్ కె. విమలాబాయి అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇది గాంధీ హాస్పిటల్ అడిటోరియంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ 2004లో తన సిల్వర్ జూబ్లీని జరుపుకుంది. తర్వాత కత్తి చంద్రయ్య గుంటూరు, హైదరాబాద్ కలెక్టర్గా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. పేదలకు భూములు పంపిణీ చేయటంలో ఆయనకు మంచి పేరు ఉంది.
విమలాబాయి ఒకవైపు డాక్టర్గా సేవలందిస్తూ, చంద్రయ్యను విజయవంతంగా నడిపించగలిగారు. వారికి భారతదేశం గర్వించదగ్గ రత్నాల్లాంటి ముగ్గురు సంతానం. వారిలో జేష్ట కుమారుడు డాక్టర్ ప్రపుల్ల చంద్ర, ఎస్ఆర్సియస్ లండన్లో చదివి ప్లాస్టిక్ సర్జిన్ గా హైదరాబాద్ లో స్థిరపడ్డారు. రెండవ కుమారుడు ప్రదీప్ చంద్ర, ఐ.ఏ.ఎస్. ఆంధ్రప్రదేశ్ క్యాడర్లో విశాఖపట్నం, గుంటూరు కలెక్టర్గా చేసి, చివరిగా తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పదవీవిరమణ పొందారు. ఇంకా ఏకైక కుమార్తె రత్న ప్రభ, విమలాబాయి తల్లిపేరు రత్నాబాయి. చంద్రయ్య తండ్రిపేరు పేరయ్య. ఇద్దరి పేర్లు కలిసొచ్చే విధంగా రత్నప్రభ అని పేరు పెట్టుకున్నారు. తల్లిదండ్రులు, అన్నల మధ్య అల్లారముద్దుగా పెరిగింది. ఆమెను డాక్టర్ చెయ్యాలని విమలాబాయి కోరిక. కానీ ఆమెకు సైన్స్పట్ల అంత మక్కువ లేదు. తండ్రి కలెక్టర్ గా ప్రజలకు సేవలందించిన తీరు, ప్రజల్లో ఆయనకున్న పలుకుబడి దగ్గరగా చూసింది. తండ్రి ప్రోత్సాహంతో ఐ.ఏ.ఎస్. కాగలిగింది. అదృష్టవశాత్తు రత్నప్రభకు కర్నాటక కేడర్ అలాట్ అయ్యింది.
విమలాబాయి అప్పటికే ఆమెకు కన్నడ, కొంకణి భాషలు కర్నాటక ప్రజల సంస్కృతి నేర్పింది. అందువల్ల రత్నప్రభ ఉత్సాహంగా రాయచూర్, బీదర్ కలెక్టర్గా రాణించి ఇంకా వివిధ హోదాలలో పనిచేసి, చివరిగా కర్నాటక రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పదవీ విరమణ పొందారు.
రత్నప్రభ జీవిత భాగస్వామి డాక్టర్ అంగలకుర్తి విద్యాసాగర్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన ఐ.ఏ.ఎస్. అధికారి. గిరిజన గూడెంలను సందర్శించి వారి జీవితాలలో మార్పును తీసుకురావటమేకాక వారి జీవితాలను కధలుగా మలచిన గొప్ప కథకుడు, ప్రముఖ కవి, రచయిత. వీరిది కూడా కత్తి చంద్రయ్య సొంతజిల్లా అయిన ప్రకాశం జిల్లాకు చివరిగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ స్థాయిలో పదవీ విరమణ పొందారు.
విమలాబాయిది ఒక ఆదర్శ కుటుంబం. ఇంటి వాతావరణం కూడా సెక్యులర్ గా ఉంటుంది. ఈ కుటుంబం ఇంత వెలుగులోకి రావటానికి విమలాబాయి క్రమశిక్షణ, కృషి, పట్టుదల కారణం. చంద్రయ్య సహజంగానే మృధు స్వభావి. ఎవ్వరిమీద కోపగించుకున్నట్లు, కఠినంగా మాట్లాడినట్టు ఉండదు. విమలాబాయి అలా కాదు.. ఆమె కంటి చూపే కమాండ్ చేసినట్లుంటది. ఆమె అనుకున్నది సాధించే తత్వం. అందుకే ఆమె పిల్లలను ఆమె అనుకున్నట్లు మలుచుకోగలిగింది. విమలాబాయి బ్రాహ్మణ కట్టుబాట్లను ధిక్కరించి ప్రాంతాలకతీతంగా కులాంతర వివాహం చేసుకొన్న తొలిరోజుల్లో తన తోబుట్టువులు దూరమైనప్పటికి ఆమె విజయాల పరంపర, సామాజిక గౌరవం చూసి మళ్ళీ దగ్గరయ్యారు.
హైదరాబాద్, బంజారాహీల్స్ రోడ్ నెం. 7లో ఇల్లు కట్టుకొని స్థిరపడ్డారు. ఆమెవైపు నుండి బ్రాహ్మణ బంధువులకు, చంద్రయ్యవైపు నుండి దళిత బంధువులకు ఒకేసారి డైనింగ్లో అన్నం వడ్డించి కులాల అంతరాలను ఛేదించిన గొప్ప సంస్కరణ వాది.
విమలాబాయి ప్రముఖ వైద్యురాలిగా, గాంధీ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్గా హైదరాబాద్ ప్రజలకే గాక ఎ.పి. ప్రజలకు సుపరిచితురాలు. అంతే కాకుండా ఆమె ఏడు భాషల్లో (కొంకణి, కన్నడ, తులు, తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్) అనర్గళంగా మాట్లాడే సమర్థురాలు. 2015 మార్చి 27న తన స్వగృహములోనే 93వ ఏట డాక్టర్ విమలాబాయి తన సుదీర్ఘ జీవన ప్రయాణాన్ని ముగించారు. ఆమె నిరంతరం ఒక వైబ్రెంట్ మహిళగా జీవించి, మహిళల అస్తిత్వానికి సాధికారతకు స్ఫూర్తిగా నిలిచారు డాక్టర్ విమలాబాయి.
(నేడు డాక్టర్ విమలాబాయి 11వ, వర్ధంతి సందర్భంగా)
