

ఓయూ విద్యార్థి సంఘాల డిమాండ్
హైదరాబాద్, 10 అక్టోబర్ (ధర్మఘంట):42% బీసీ రిజర్వేషన్ బిల్లును భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని దలిత్ బహుజన్ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కోఆర్డినేటర్ జంగిలి దర్శన్ అన్నారు. నేడు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ మరియు ఇతర దలిత బహుజన స్టూడెంట్స్ సంఘాలతో కలసి, సంయుక్తంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు ధర్నా నిర్వహించి, అనంతరం జరిగిన ప్రెస్ మీట్లో సంఘాల వారిగా తమ డిమాండ్లను వెల్లడించాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 42% బీసీ రిజర్వేషన్ బిల్లును భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని, “బీసీ రిజర్వేషన్‌పై కుట్రలు లేదా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సంఘాలు ఒక్కటై ఉద్యమం చేపడతాయని. సామాజిక న్యాయం, రాజకీయ సమానత్వం కోసం తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం తప్పనిసరి” అని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు జి. కిరణ్ కుమార్ మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్ చట్టం సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచింది. ఈ చట్టం పట్ల హైకోర్టులో సవాళ్లు ఎదురవుతున్న పరిస్థితిలో, దీనిని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం ద్వారానే శాశ్వత న్యాయరక్షణ లభిస్తుంది. మోడీ ప్రభుత్వం వెంటనే ఈ విషయంపై స్పందించి, బీసీలకు న్యాయం చేయాలి” అని డిమాండ్ చేశారు.
ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాజేష్ షమీర్పేట్ మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలి. హైకోర్టు మరియు సుప్రీంకోర్టు విచారణలకు ముందే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ రక్షణ కల్పించాలి.ఇది బీసీల భవిష్యత్‌కు రక్షణ కల్పించే చారిత్రక నిర్ణయం అవుతుంది” అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో విద్యా, ఉద్యోగ మరియు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే చట్టాన్ని భారత రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
ఈ కార్యక్రమంలో జార్జి రెడ్డి పి.డి.ఎస్.యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్. నాగేశ్వరరావు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంగల పాండు, మహాజనగలం వ్యవస్థాపక అధ్యక్షులు సురేష్ మహాజన, ప్రజా గళం వ్యవస్థాపక అధ్యక్షులు కాంశిం, డి.బి.ఎస్.ఏ నాయకుడు శ్రీనివాస్, మహేష్ మరియు ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నాయకులు ఆరవింద్, రాకేష్ దుత్త, శివ యాదవ్, అశ్విన్, లక్ష్మణ్, సూర్య, మధు తదితరులు పాల్గొన్నారు.
