అంతర్జాతీయ శాంతి దినోత్సవం – మానవత్వానికి మార్గదర్శకం

“శాంతియుత ప్రపంచం” కోసం చర్యలు తీసుకోవాలి

 (‘శాంతి’ అనే పదం వినటానికి కరువైన రోజులు దాపురించాయా ? అనే ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ శాంతి దినోత్సవం సందర్భంగా …)  

హైదరాబాద్, 21 సెప్టెంబర్, 2025 (ధర్మఘంట): ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21న “అంతర్జాతీయ శాంతి దినోత్సవం” (ప్రపంచ శాంతి దినోత్సవం) జరుపుకోవాలని 1981లో ఐక్యరాజ్యసమితి ప్రపంచ  దేశాలకు పిలుపునిచ్చింది. ఆ రోజున శాంతి ఆశయాలకు కట్టుబడి ఉండాలని, 24 గంటల పాటు ఏ రకమైన హింస జరగకుండా, కాల్పుల విరమణ చేయాలని నొక్కిచెప్పింది. ఆ రోజున న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో శాంతి గంటను మోగించడంతో కార్యక్రమాలు మొదలవుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. సభలు సమావేశాలు  ఏర్పాటు చేసుకుంటారు. కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా అందరూ, శాంతి స్థాపనకు కృషిచేస్తారు. “శాంతిని బలవంతంగా ఉంచలేము; దానిని అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే సాధించవచ్చు.” అని – ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ అన్నాడు. అంటే హింసలేని జీవనానికి,శాంతి ఒక్కటే మార్గమని బయలుపరిచాడు.

ప్రపంచాన్ని ప్రశాంతంగా, శాంతియుతంగా మార్చాలంటే మొదట నైతిక విలువలు నేర్పించాలి. చైతన్యవంతమైన మేధో  సమాజానికి నైతిక విలువలే మూలస్తంభాలు . అయితే  శాంతియే మన దృక్పథమైనప్పుడు మానవ మనుగడకు సహనం ప్రేమ ముమ్మాటికీ అవసరం. వ్యక్తిగా, సమాజ శ్రేయోభిలాషిగా హింసకు, తగాదాలకు చోటివ్వకూడదు. ఇతరుల విధానాలను అడ్డుకోవద్దు. నీకెవరూ కష్టం కలిగించకూడదని, హాని చేయకూడదు అనుకుంటే నీవు ఇతరులను కష్టపెట్టడం, హాని చేయడం మానుకోవాలి. అదే కదా మనిషితత్వం. మంచితనం మానవత్వం అంటే. మన అస్తిత్వాన్ని రక్షించుకుంటూనే ఇతరుల మతాలని, కులాలని, అభిప్రాయాలను గౌరవించాలి. అప్పుడే కదా మనుషులం అనిపించుకుటం. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి “ఆంటోనియో గుటెరెస్” కూడా ఈ సందర్భంగా ఆయుధాలను వదిలి, అందరు శాంతి వైపు అడుగులు వేయాలని ప్రపంచానికి హితం బోధించారు. కాలం గడిచేకొద్దీ అంతర్జాతీయ శాంతి దినోత్సవం నిజంగానే ప్రపంచ వ్యాప్త స్వభావాన్ని సంతరించుకుంటోంది. ప్రతిదేశంలోనూ ఈ ఉత్సవాన్ని సంరంభంగా జరుపుకుంటున్నారు

20వ శతాబ్దంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల్లో దాదాపు 10 కోట్ల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారని చరిత్ర చెప్తుంది. ఎన్నో నగరాలు నాశనమయ్యాయి. అర్థింకంగా దెబ్బతిన్నాయి అనంతరం ఏర్పడిన ఐక్యరాజ్యసమితి శాంతి కోసం పలు తీర్మానాలను ఆమోదించింది. ఐక్యరాజ్య సమితి  1981లో బ్రిటన్, కోస్టారికా దేశాల చొరవతో శాంతి దినోత్సవం జరపాలని నిర్ణయించింది. ప్రారంభ రోజుల్లో సెప్టెంబరు నెలలోని మూడో మంగళవారం జరిపేవారు. 2001లో సెప్టెంబర్ 21 తేదీ జరపాలని నిర్ణయించారు. ఆ మేరకు 2002 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆరోజునే జరుపుతున్నారు.

భారత్‌ గతేడాది తన అణ్వస్త్రాలను స్వల్పంగా పెంచుకోవడంతోపాటు వినూత్న అణు సరఫరా వ్యవస్థల అభివృద్ధిని కొనసాగిస్తోంది. ప్రస్తుతం దాని వద్ద 172 అణ్వస్త్రాలు ఉన్నాయని. ఈ ఏడాది వాటి సంఖ్య 180కి చేరుకుంటుందని స్టాక్‌హోం అంతర్జాతీయ శాంతి పరిశోధక సంస్థ (స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) (సిప్రీ) అంచనా వేసింది. 

1980ల మధ్యలో, ప్రపంచవ్యాప్తంగా అణు వార్‌హెడ్‌లు, బాంబులు మరియు షెల్స్ దాదాపు 64,000 ఉండేవి. నేడు, ఆ సంఖ్య 12,241గా అంచనా వేయబడింది.  2025 నాటికి, రష్యా మరియు అమెరికా సుమారు 5,000 కంటే ఎక్కువ అణ్వాయుధాలతో ప్రపంచంలోనే అత్యధిక అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి, వాటి తర్వాత చైనా, ఫ్రాన్స్, మరియు యునైటెడ్ కింగ్‌డమ్ ఉన్నాయి. పాకిస్తాన్, భారతదేశం, ఇజ్రాయెల్, మరియు ఉత్తర కొరియా కూడా అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. ఆయుధం ఉంది అంటేనే ప్రమాదం పొంచి ఉందని అర్థం.

అమెరికా తమ ఆయుధాలను అమ్ముకునేందుకు ఆసియాలోని వివిధ దేశాల మధ్య వివాదాలను యుద్ధాలుగా తయారుచేసి, సొమ్ముగా పోగు చేసుకుంటుతుంది. యుద్ధాల వల్ల ప్రజలు నష్టపోవడమే కాక ప్రకృతికి, నేలకు తీవ్రమైన నష్టం కలుగుతుంది. అణ్వాయుధాల ఉత్పత్తిలో వచ్చే వ్యర్థాలను వదిలివేయటం వల్ల కలిగే అణుధార్మికత, జీవ రసాయన ఆయుధాల ప్రయోగాల సమయంలో కలిగే వాతావరణ కాలుష్యాల ప్రభావం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం నిత్యం ఉంటుంది. యుద్ధం వల్ల ప్రజలు ఆకలితో అలమటిస్తారు. పిల్లలు శవాలుగా,అనాథలుగా మారుతారు. ఈ మధ్య కాలం లో రష్యా- ఉక్రెయిన్. ఇజ్రాయిల్-గాజా. వంటి దేశాలు శాంతిని మరిచి యుద్ధానికి కాలుదువ్వుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతి ఆవశ్యకత ఎంతైనా ఉంది.

శాంతి ఉన్నపుడు ఎవ్వరు ఏ దేశం మీద దాడి చెయ్యరు. ఎవ్వరూ ఆకలితో పస్తులు ఉండరు. యుద్ధం అనే మాట వినపడదు. విబేధాలు ఉండవు. కేవలం ప్రేమ శాంతి మాత్రమే శాశ్వతంగా ఉంటాయి. అందుకే యుద్ధ రహిత సమాజం ఉండాలని ఆశిద్దాం. విశ్వశాంతిని గూర్చి విద్యార్థులకు పాఠ్యంశంగా చేర్చి, తరగతి గదిలో భోధించాలి. వారిలో చైతన్యం కలిగించాలి. అలాగే అన్ని కళాశాలల్లో విద్యార్థులతో శాంతి అనే అంశంపై మాట్లాడనివ్వాలి. పోటీలు, కళా ప్రదర్శనలతో బాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలి.

ప్రపంచ శాంతి దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రజలు గుంపుగా ఓ చోట చేరాల్సిన అవసరంలేదు . ఎవరైనా, ఎక్కడైనా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవచ్చు . ఏ వేళలోనైన సరే ఒక క్యాండిల్ వెలిగిస్తే చాలు లేదా మౌనంగా కొద్దిసేపు కూర్చుని ధ్యానం చేసినా చాలు లేదా సహోద్యోగులు, వివిధ సంస్థలు, స్థానిక ప్రభుత్వాలు భారీ కార్యక్రమాన్ని జరిపి “శాంతి ఆవస్యకత” గురించి ప్రజలకు చక్కగా వివరించవచ్చు .

రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు అణ్వాయుధాలు, ఇతర రకాల రక్షణ వ్యవస్థలపై చేయబోయే ఖర్చు కొంతమేరకైనా సామాజిక ప్రయోజనాల మీద, విద్యా వ్యవస్థల మీద శ్రద్ద చూపిస్తే సమాజం చైతన్యవంతంగా తయారవుతుంది.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *