ఆత్మగౌరవానికి ప్రతీక “పెరియార్” : ప్రొ. కంచ ఐలయ్య షెప్పర్డ్

హైదరాబాద్, 18 సెప్టెంబర్ 2025 (ధర్మఘంట):  స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానాయకుడు పెరియార్ అని, ప్రొ. కంచ ఐలయ్య షెప్పర్డ్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ న్యూ సెమినార్ హాల్‌లో, డి.బి.ఎస్.ఏ – దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, డి.బి.ఎస్.ఏ స్టేట్ కో ఆర్డినేటర్ జంగిలి దర్శన్ అధ్యక్షతన పెరియార్146వ జయంతి మహోత్సవం ఘనంగా, చారిత్రాత్మకంగా జరిగింది. 

ఈ సభకు ప్రధాన వక్తగా విచ్చేసిన ప్రొఫెసర్ కంచ ఐలయ్య షెప్పర్డ్ మాట్లాడుతూ పెరియార్ ఒక వ్యక్తి కాదు, ఒక పుంజుకున్న జ్వాలని, ఆయన ఆలోచనలు కేవలం పుస్తకాలలో బంధించబడిన మాటలు కాదు, చరిత్రను కదిలించే శక్తికి మారుపేరని, కుల గోడలను కూల్చిన ధైర్య స్వరం, మూఢనమ్మకాలపై విసిరిన సవాలు అదే పెరియార్ ఇ.వి రామస్వామి నాయకర్ అని అన్నారు. ఈ జయంతి కేవలం జ్ఞాపకార్థం కాదు, ఇది ఒక ఆశయ సాధన సభ. పెరియార్ చూపిన దారి  కుల నిర్మూలన, సమానత్వం, ఆత్మగౌరవం. ఇవే భావితర సమాజానికి మూలస్తంభాలు. ప్రతి విద్యార్థి, ప్రతి యువకుడు ఆయన బోధనలను గుండెల్లో దాచుకుని ఆచరణలో పెట్టాలని, పెరియార్ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని అదే పెరియార్‌కు మనం అందించే నిజమైన గౌరవమని, అదే మన అందరి బాధ్యతని, ఆయన కలలు కని చూపిన సమానత్వ సమాజాన్ని నిర్మించే తరం మనమే కావాలని, ఆయన స్ఫూర్తి ఎప్పటికీ మసకబారదని, మన రక్తంలో ప్రవహిస్తూ, మన అడుగులను ముందుకు నడిపిస్తూనే ఉంటుందని, పెరియార్ స్ఫూర్తిని కొనసాగించాలని పేర్కొన్నారు.

డి.బి.ఎస్.ఏ వ్యవస్థాపక అధ్యక్షులు డా. నలిగంటి శరత్ చమార్ మాట్లాడుతూ పెరియార్ చూపిన బాటే మనకు నిజమైన మార్గం. యువతే భవిష్యత్తు. ఆత్మగౌరవం, సమానత్వం, సామాజిక న్యాయం అనే మూడు మూలస్తంభాలు మన సమాజాన్ని నిర్మించనున్నాయి. ఈ జయంతి మహోత్సవం కేవలం ఒక జ్ఞాపకం కాదు, ఇది ఒక నిరంతర ఉద్యమం. పెరియార్ స్ఫూర్తి మన గుండెల్లో వెలుగుతూనే, మన అడుగులు ముందుకు నడిపిస్తూనే ఉంటుంది అని తెలిపారు.

ముఖ్య అతిధులుగా పాల్గొన్న పాశం యాదగిరి, డా. అంజయ్య, ప్రొ. ఇందిర, డి.హరి కృష్ణ, రామంచ భరత్, సురేష్ మహాజన, కరుణాకర్ బహుజన్ లు ప్రసంగించి, పెరియార్ ఆశయాలను మరింత బలంగా విశ్వవ్యాప్తం చేయాలనే దిశగా మార్గదర్శక ప్రసంగాలు చేశారు. సభలో పాల్గొన్న మేధావులు, ప్రొఫెసర్లు, కవులు, రచయితలు, వాగ్గేయకారులు, సామాజిక ఉద్యమకారులు తమ విలువైన ఆలోచనలు పంచుకున్నారు. ఈ మహోత్సవం విద్యార్థుల్లో విశేష ఉత్సాహాన్ని రగిలించి, పెరియార్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే సంకల్పం బలపడింది.

ఈ జయంతి మహోత్సవంలో డి.బి.ఎస్.ఏ, భీమ్ డ్రమ్ నాయకులు జంగిలి దర్శన్, కాసర్ల మధుసూదన్, రజినీకాంత్, వెంకట్, సైదులు, దయాకర్, సందీప్, రాజు, అజయ్, అరవింద్, ప్రదీప్ మరియు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ సామాజిక ఉద్యమ కారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *