స్వాభిమాన ఆత్మగౌరవ పోరాట యోధుడు “పెరియార్”

ద్రవిడ జాతిపిత, సామాజిక సంఘ సంస్కర్త, స్వాభిమాన ఆత్మగౌరవ పోరాట యోధుడు పెరియార్ ఇ. వి. రామస్వామి నాయకర్. ఆయన 1879 సెప్టెంబర్ 17న తమిళనాడులోని ఈరోడ్ పట్టణంలో సంపన్న వ్యాపార బలిజ కుల కుటుంబంలో వెంకటప్ప నాయకర్, చిన్న జియమ్మల్ దంపతులకు జన్మించాడు. ఈయన 94 సంవత్సరాల 3 నెలల 7 రోజులు జీవించి 1973 డిసెంబర్ 24న తుదిశ్వాస విడిచారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, కుల నిర్మూలన, మానవ విలువల కోసం హిందూ మత ఆచారాలను, కట్టుబాట్ల లోపాలను ఎత్తిచూపి బ్రాహ్మణిజానికి అతను సవాల్ గా నిలిచి, మనువాదుల గుండెల్లో రివాల్వర్ గా మారాడు.

బాల్యం నుండి మూఢ నమ్మకాల పట్ల వ్యతిరేకత, దేవుడు, మతం పట్ల అయిష్టతతో ప్రతిదానిని సూక్ష్మంగా ఆలోచించే స్వభావాన్ని ఏర్పరుచుకున్నాడు. పెద్దగా చదువుకోనప్పటికీ అప్పటి కుల, మత, సామాజిక, రాజకీయ అంశాలలో తగిన పరిజ్ఞానం వుండేది. యవ్వన దశ రాగానే 19వ యేట నాగమ్మాయి’తో వివాహమైంది. దురదృష్ట వశాత్తుతో ఆయనకు పుట్టిన పాప 5 నెలలకే మరణించింది. ఆ తరువాత వీరికి సంతానం కలగలేదు. కుటుంబ జీవనంలో విసుగు చెంది, కాశీయాత్రకు వెళ్ళిన వెళ్లిన సమయంలో పెరియార్ కు అక్కడ బ్రాహ్మణ సత్రంలో అవమానం జరిగింది. 

బ్రాహ్మణిజానికి పునాది హిందూ మతం యొక్క భయంకరమైన కుల వివక్ష అతన్ని ఆలోచింపచేసి కుల నిర్మూలన, కుల వివక్షకు వ్యతిరేక ఉద్యమాలు చేసేటట్లు ప్రేరేపించింది. ఆ సంఘటన, భారత దేశంలో స్వాతంత్ర్యోద్యమం నడుస్తున్న కాలమది. ఈరోడ్ మున్సిపల్ చైర్మన్ పదవితోపాటు, మరో 28 గౌరవాధ్యక్ష పదవులకు రాజీనామా చేసి, 1919 నుండి 1925 వరకు కాంగ్రెస్ పార్టీలో పెరియార్ నాయకర్ చేరి మొదటగా గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై, కాలక్రమేణా గాంధీ – కాంగ్రెస్ పార్టీ బ్రాహ్మణవాద విధానాలు, ఆ పార్టీ బడుగు, బలహీన వర్గాల వారికి, దళిత, గిరిజన, ఆదివాసీ, మైనారిటీ ప్రజలకు చేసిందేమీ లేదని 1925వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చాడు.

 పెరియార్ నాయకర్ కాంగ్రెస్ నుండి బయటకు రావడానికి కెరళా వైకోం ఉద్యమ సమయంలో అతని మీద కేసులు పెట్టి జైళ్ల పాలు చేయడం మరియు శూద్రులకు, ఉత్పత్తి కులాల ప్రజలకు విద్య ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు కావాలని పెరియార్ 1920-25 వరకు జరిగిన కాంగ్రెస్ సభలల్లో తీర్మానాలు పెడితే ఆ పార్టీ బ్రాహ్మణ వాదులు ఆ తీర్మాణాన్ని నెగ్గనిచ్చేవారు కాదు. కనుకనే పెరియార్ ఆత్మగౌరవంతో బయటకు వచ్చి, వివిధ పోరాట కార్యక్రమాల్ని నిర్వహించాడు.

 1929 సంవత్సరంలో ఆత్మగౌరవ స్వాభిమాన ఉద్యమానికి పిలుపునిచ్చి కుల చైతన్యం. అంటరానితనం నేరంగా పరిగణించబడడం వంటి విషయాలలో ప్రజలను ఆలోచింప చేశాడు పెరియార్. మధ్యపాన నిషేధం కోసం అనేక కార్యక్రమాలను నిర్వహించాడు. తన సొంత పొలములో వున్న తాటి, ఈత, కొబ్బరి చెట్లను కూడా నరికించడమంటే ఉద్యమంలో అన్నింటినీ నాదీ, నీదీ అనే తేడా లేకుండా ఉండడం అందరికీ సాధ్యపడదు. పెరియార్ లాంటి నిఖఛ్చితమైన స్వభావం కలిగిన వారికే సాధ్యమవుతుంది.

పెరియార్ విదేశీ పర్యటనలు కూడా చేశాడు. దాదాపు 11 నెలలు పర్యటించాడు. ఈజిప్టు, గ్రీసు, టర్కీ, రష్యా, జర్మనీ, ఇంగ్లాండ్, స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్ వంటి దేశాలలో జీవన విధానాలు, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను తెలుసుకోగలిగాడు. విదేశీ పర్యటనలు విలాసంగా కాకుండా ఒక సామాజిక అధ్యయన యాత్రగా చేశాడు. తాను పర్యటించిన దేశాలలో ఉన్న పరిస్థితులు భారతదేశంలో వున్న మత ఛాందస వాద పరిస్థితులు ఏ విధంగా వున్నాయో ఒక అవగాహనకు రాగలిగాడు. పెరియార్ తాను దినదినం మారుతున్న కాలానికి అనుగుణంగా వెళ్ళ సాగాడు. 1933లో ఆత్మగౌరవ కమ్యూనిస్టు పార్టీని ప్రారంభించి ‘పురచ్చి’ విప్లవ పత్రికను నడిపాడు. కొన్ని రోజులు తన ఉపన్యాసాలలో కమ్యూనిజం ప్రభావం కనపడేది.

 అనంతరం కమ్యూనిస్టు పార్టీ నుండి బయటకు వచ్చి “జస్టిస్ పార్టీని ఏర్పాటు చేసి, శూద్రులకు, అతిశూద్రుల హక్కుల కోసం ఉద్యమించాడు. 1937లో “విదుతులై” అనే దినపత్రికను నడిపాడు. తన జీవితమంతా కూడా అనగారిణ వర్గాల కోసం, నిమ్న జాతి ప్రజల కోసం, సమానత్వ నైతిక విలువల కోసం పోరాడిన బహుజన నాయకుడు పెరియార్, స్త్రీల హక్కులను గుర్తించి, స్త్రీ చైతన్యాన్ని, స్త్రీ విద్యను ప్రోత్సహించాడు. 1940-42 లలో గవర్నర్ జనరల్ మద్రాస్ గవర్నర్లు దక్షిణ భారత దేశానికి ప్రధాన మంత్రి (ముఖ్యమంత్రి) పదవికి ఆహ్వానిస్తే దానిని తిరస్కరించారు. ఆయన, అంటే పదవుల మీద తనకు వ్యామోహం లేదని చాటి చెప్పాడు.

1944 సంవత్సరంలో జస్టిస్ పార్టీ పేరును డి.ఎం.కె.గా మార్చాడు. నలుపును నిరసనకు చిహ్నంగా చూపాలని పెరియార్ చెప్పాడు. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం కాదనీ, అది విషాధ సంతాప దినంగా ప్రకటించాడు. ఎందుకంటే తెల్లదొరలు పోయి నల్లదొరలు (మనువాదం) ఈ దేశాన్ని ఏలుతుదందనీ, ఇది మాకు నిజమైన స్వాతంత్య్రం కాదని ప్రకటించాడు. 1951లో రిజర్వేషన్ల మద్దతుగా ఉద్యమాన్ని చేపట్టి తొలి రాజ్యాంగ సవరణ చేయించాడు. 

1953లో రిజర్వేషన్లను రద్దు చేసినందుకు వినాయక విగ్రహాలు పగులగొట్టే కార్యక్రమాలకు పిలుపునివ్వడం వంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆయనకు ఆయనేసాటి అని చెప్పవచ్చు.  భారత రత్న, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహ్మద్ ఆలీ జిన్నాలతో కొన్ని సందర్భాలలో కలుసుకుని సామాజిక, ఆర్థిక, రాజకీయ సంబంధమైన విషయాలను చర్చించేవారు, కుల నిర్మూలన అంటరాని తనం అనే అంశాలపై జరిగే సభలలో కలుసుకునేవారు. డా॥ అంబేద్కర్ -పెరియార్. 1954లో “బుద్దుడి” జన్మదినోత్సవాలకై బర్మా వెళ్ళాడు.

భారత దేశంలోని నిచ్చన మెట్ల కుల వ్యవస్థకు అసమానత్వానికి, మనుషుల మధ్య హెచ్చుతగ్గులకు, నైతిక విలువల పతనానికి కారణం హిందూ మతమని, మతాన్ని నిర్మూలించాలని పెరియార్ నాయకర్ అన్నారు. హిందూ మత విధానాలన్ని కూడా కల్పితాలతోటి, అవాస్తవంగా, అశాస్త్రీయంగా వున్నాయని మండిపడ్డాడు పెరియార్. సమానత్వాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరు అగ్గిబరాటై పోరు చేయాలని పిలుపునిచ్చాడు. డా॥ బాబా సాహెబ్ అంబేద్కర్ రాసిన “కుల నిర్మూలన” పుస్తకాన్ని తమిళంలోనికి అనువదించి ప్రతి ఒక్కరితో చదివించేలా చర్యలు తీసుకున్నారు.  దక్షిణాది రాష్ట్రాలపై హిందీ బాషను బలవంతంగా రుద్దటాన్ని నిరసిస్తూ జాతీయ జెండాను తగులబెటైన పెరియర్ తాను నమ్మిన సిద్ధాంతాలను ఖచ్చితంగా ఆచరణలో పెట్టేవారు.

అణగారిన వర్గాలవారికి, అంటరాని వారికి, అస్పృశ్యులకు దేవాలయ ప్రవేశాల ఉద్యమాన్ని చేపట్టాడు. 1940 సం॥రం రైల్వే క్యాంటీన్లపై, “బ్రాహ్మణ పలహారశాల” అనే బోర్డుల్లో బ్రాహ్మణ పదాన్ని తొలగించే కార్యక్రమం చేపట్టి, తమిళనాడు రాష్ట్రమంతా ఈ ఉద్యమాన్ని వ్యాపింపచేశాడు. బ్రాహ్మణ, రెడ్డి, వైశ్య, కమ్మ, కాపు భోజనశాల అని రాయడాన్ని పెరియార్ తీవ్రంగా వ్యతిరేకించాడు. బ్రాహ్మణాధిక్యత కుల వ్యవస్థ, పురుషాధిక్యత, హిందూమత ఆచారాలు, కట్టుబాట్లు వంటి వాటికి వ్యతిరేకంగా జీవితాంతం ఉద్యమించిన పోరాట యోధాను యోధుడు పెరియార్. కుల నిర్మూలన జరగాలనీ, ప్రతి మనిషి సమాజంలో గౌరవంగా బ్రతకాలనేది పెరియార్ ఆకాంక్ష.

1959 సంవత్సరంలో మానవున్ని అంధకార మత విశ్వాసాలు అధోగతి పాలు చేస్తున్నాయని పెరియార్ ఆగ్రహించి, రామాయణం మూఢనమ్మాలు అనే నినాదంతో ఉత్తరాది నగరాలలో సభలు నిర్వహించేవారు. కుల వివక్ష లేని సమాజం కోసం మతాధిపత్యం లేని నూతన వ్యవస్థను నిర్మించాలని, పెరియార్ కలలుగన్నాడు. అందుకే తన జీవితంలో ప్రతీక్షణం అణచివేతకు గురయ్యే కులాలకోసం పోరాడాడు. తన జీవితంలో 11వేల సభల్లో మాట్లాడిన పెరియార్, 9 లక్షల కిలోమీటర్ల ప్రయాణం, 2.15 లక్షల గంటలు వివిధ సభలలో ఉపన్యసించాడు. కనుక అతని ప్రతిమాట, ప్రతి అడుగు మనకు ఆదర్శనీయం, అనుసరణీయం.

1970 జూన్ 7న ఐక్యరాజ్యసమితి విభాగమైన యునెస్కో పెరియార్ కు అవార్డును ప్రకటించింది. ఆ సందర్భంగా పెరియార్ ను సత్కరిస్తూ ఇలా రాశారు: ‘నూతన యుగ ప్రవక్త, ఆగ్నేయాసియా దేశాల సోక్రటీస్, సంఘ సంస్కరణోద్యమ పితామహులు, అజ్ఞానానికి, మూఢ నమ్మకాలకు, అర్థంలేని సాంప్రదాయాలకు బద్ద శత్రువు.

1973 డిసెంబర్ 19న మద్రాస్ థింకర్స్ అసోసియేషన్ వారి సభలలో పెరియార్ యొక్క చివరి ప్రసంగం. 1973 డిసెంబర్ 24న వెల్లూర్ ఆస్పత్రిలో కన్నుమూసారు. సెప్టెంబర్ 17న దళిత బహుజనులకు ప్రత్యేక దినం. ఎందుకంటే పెరియార్ జన్మించిన దినం. అందుకే కోట్లాది మంది దళిత బహుజనులు పెరియార్ మీమీరు మనువాదుల గుండెల్లో రివాల్వర్, పెరియార్ మీకు బహుజనులందరి జోహార్లు అని తలుచుకుంటారు.

పెరియార్ ఆశయాలను మరింత బలంగా సమాజంలో విశ్వవ్యాప్తం చేసేందుకు భావితరాలకు పెరియార్ స్ఫూర్తిని నింపేందుకు ప్రొఫెసర్లు, మేధావులు, కవులు, రచయితలు, వాగ్గేయకారులు, సామాజిక ఉద్యమకారులు, బహుజన విద్యార్థి నాయకుల సమక్షంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం కేంద్రంగా ఒక మేదోమధనం జరపాలని భావించి, దళిత్ బహుజన్ స్టూడెంట్ అసోసియేషన్ డి.బి.ఎస్ ఏ విద్యార్థి సంఘం “పెరియార్ 146వ జయంతి” మహోత్సవాన్ని జరుపాలని, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ న్యూ సెమినార్ హాల్ లో 17 సెప్టెంబర్ 2025 రోజున నిర్వహించడానికి సిద్ధమయ్యారు.

పెరియార్  ఆశయాలను, సిద్ధాంతాలను ఆయన కోరుకున్న నవయుగ సమాజం కోసం, ఆయన బాటలో నడవడమే ఆయనకిచ్చే అసలు సిసలైన గౌరవం.

(నేడు పెరియార్ 146వ జయంతి సందర్భంగా)

జంగిలి దర్శన్
పిహెచ్డీ రీసెర్చ్ స్కాలర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం. మరియు డి.బి.ఎస్.ఏ  స్టేట్ కోఆర్డినేటర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *