డా.అంజయ్య సేవలు ఆదర్శనీయం
డి.బి.ఎస్.ఏ విద్యార్థి సంఘం నాయకుల బృందం సన్మాన, సత్కారాలు

హైదరాబాద్, 06 నవంబర్ (ధర్మఘంట): ఆరోగ్య రంగంలో అత్యున్నతమైన సేవలను లక్ష్యంగా పెట్టుకుని, వైద్య వృత్తిలో విలువలు పాటిస్తూ నిస్వార్థ సేవలతో ప్రతి రోగి ప్రాణాన్ని కాపాడటాన్ని ధర్మంగా మార్చుకున్న డా. అంజయ్య వ్యక్తిత్వం అనర్గళమని డి.బి.ఎస్.ఏ స్టేట్ కో ఆర్డినేటర్, ఓయూ స్కాలర్ జంగిలి దర్శన్ అన్నారు. నేడు ఎల్బీనగర్ లోని కామినేని దవాఖానలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ కామినేని హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తూ, వైద్య సేవల్లో నైతిక విలువలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సమాజంలో ఆరోగ్యభద్రతను బలోపేతం చేస్తున్న నిస్వార్ధ వైద్యునిగా పేర్గాంచి, వైద్య వృత్తిలో కర్తవ్యమే జీవనంగా, మానవతనే మతమన్న భావంతో, గతంలో గాంధీ హాస్పిటల్ లో, ఉస్మానియా హాస్పిటల్ లో వివిధ ముఖ్య హోదాలో పనిచేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వైద్యునిగా పదవీ విరమణ ఆనంతరం కూడా అంకితభావంతో పనిచేస్తున్న ఈ గొప్ప వ్యక్తిని మర్యాదపూర్వకంగా డిబిఎస్ఏ బృందంతో కలిసి, సన్మానించి, సత్కరించే అవకాశం లభించడం గౌరవ సూచకంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. రోగులు వచ్చిన ప్రతిసారి ఆశతో చూసే డా. అంజయ్య చిరునవ్వు ఎన్నో కుటుంబాల జీవితాల్లో మళ్లీ వెలుగులు నింపుతుందని అందుకే డా. అంజయ్య సేవా తపన, నిబద్ధత మాకు ఆదర్శం, ప్రేరణ అని ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో కప్పపహాడ్ కారోబార్ దేవదాసు, డి.బి.ఎస్.ఏ విద్యార్థి నాయకులు మరియు రీసెర్చ్ స్కాలర్స్ సైదులు, అరవింద్ కలిసి పాల్గొని ఈ భేటీని అర్థవంతం చేశారు. వైద్య సేవలు అందించడమే కాకుండా సమాజానికి అవగాహనను కూడ పెంపొందించే డా. అంజయ్య నాయకత్వం ఆరోగ్య రంగంలో సాటిలేనిదన్నారు.
ఇలాంటి గొప్ప వ్యక్తుల సాన్నిధ్యం మరింత సేవాభావాన్ని పెంచుతూ, ప్రజల జీవన ప్రమాణాలను అభివృద్ధి చేసేందుకు ప్రేరణగా నిలుస్తుందని, ఈ సందర్భంగా డా. అంజయ్య అందించిన ఆతిథ్యం, మాటల్లో నిక్షిప్తమైన మానవీయత ఒక్క క్షణం కూడా మరచిపోలేని అనుభూతిగా నిలిచిపోయిందన్నారు. సమాజానికి మేలు చేయాలన్న మన ధృఢసంకల్ప ప్రయాణంలో ఇలాంటి గొప్ప వైద్యుల ఆదర్శం ఎల్లప్పుడూ మార్గదర్శకత్వం కలిగిస్తుందని విశ్వసిస్తున్నామని తెలిపారు.
