కృష్ణా నది యాజమాన్య బోర్డును విశాఖపట్నానికి తరలించాలని 2014లో నిర్ణయించబడినప్పటికీ, నేటికి హైదరాబాద్‌లోనే కొనసాగుతుంది. 2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడకు తరలించాలనే డిమాండ్లు పెరిగాయి.
కృష్ణా బోర్డుకు ఊరకే లేఖలతో సరి
విభజన చట్టం ప్రకారం దాని ఆఫీసు ఆంధ్ర రాజధానిలో ఉండాలి
కానీ పదేళ్లుగా హైదరాబాద్‌లోనే
జగన్ హయాంలో విశాఖకు తరలించాలని ప్రతిపాదన
అంగీకరించని బోర్డు అధికారులు, సిబ్బంది
కూటమి ప్రభుత్వం రాగానే బెజవాడకు రావాలని ఉత్తరాలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఆంధ్రప్రదేశ్ రాజధానిలో, గోదావరి బోర్డు (జీఆర్ఎంబీ) తెలంగాణ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మేరకు 2014లో గెజిట్ జారీచేశారు. పదేళ్లు దాటినా ఇప్పటికీ కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయం హైదరాబాద్ జలసౌధలోనే కొనసాగుతోంది. 2014-19 నడుమ ఇదిగో అదిగో అంటూ బోర్డు అధికారులు కాలయాపన చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్.. మూడు రాజధానుల క్రీడకు తెరలేపారు. 2022లో కేఆర్ఎంబీ ఆఫీసుని విశాఖకు తరలించాలని బోర్డు చైర్మన్‌కు జల వనరుల శాఖ లేఖ రాసింది. కృష్ణా డెల్టాతో సంబంధం లేని చోటకు ఎలా తరలిస్తారని విమర్శలు వెల్లువెత్తినా జగన్ పట్టించుకోలేదు. కానీ ఉద్యోగులు, సాగునీటి నిపుణులు మాత్రం కేఆర్ఎంబీని కృష్ణా నదితో సంబంధం లేని చోట ఏర్పాటు చేయాలనడాన్ని తప్పుబట్టారు. హైదరాబాద్‌ను వీడి రావడం బోర్డు సభ్యులకు, సిబ్బందికి ఇష్టం లేకపోవడంతో విశాఖ తరలింపు కార్యరూపం దాల్చలేదు. 2024లో టీడీపీ కూటమి వచ్చాక.. కేఆర్ఎంబీని ఏపీ రాజధానికి తరలించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. విజయవాడకు తరలించాలని రాష్ట్ర సాగునీటి సంఘాల సమాఖ్య చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్టారావు లేఖ అందించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు కూడా బోర్డుకు లేఖలు రాశారు.
సాగర్ నుంచి పూర్తి విడుదల ఏదీ?
కేఆర్ఎంబీ హైదరాబాద్‌లోనే ఉండడంతో నాగార్జున సాగర్ ఎడమ ప్రధాన కాలువ నుంచి కృష్ణా డెల్టాకు కేటాయింపులకు అనుగుణంగా నీటిని విడుదల చేయకపోయినా నిలదీయలేని పరిస్థితి ఎదురవుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది సాగర్ నుంచి కేటాయించిన 18 టీఎంసీలు పూర్తిగా రాలేదని సాగునీటి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బోర్డు కార్యాలయం విజయవాడలో ఉంటే అధికారులను కలిసి నీటి విడుదలకు ఒత్తిడి తేవడానికి ఆస్కారం ఉంటుందని అంటున్నాయి.