2030 నాటికి 500 జీడబ్ల్యూ నాన్-ఫాసిల్ ఇంధనమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి లోకేష్ అన్నారు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణే తమ నినాదమన్నారు. అనంతపురానికి కియా మోటార్ల పరిశ్రమ తెచ్చామని, మేక్ ఇన్ ఇండియా ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకొస్తామన్నారు.
అనంతపురం, మే 16: జిల్లాలోని గుత్తి మండలం బేతపల్లిలో మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఈరోజు (శుక్రవారం) పర్యటించారు. ఈ సందర్భంగా రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్‌కు మంత్రి లోకేష్ భూమి పూజ చేశారు. 2,300 ఎకరాల్లో రూ.22 వేల కోట్లతో రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్‌ను నిర్మించనున్నారు. పవన, సోలార్, బ్యాటరీ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కాంప్లెక్స్ నిర్మాణం జరుగనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భవిష్యత్ ఆశలు, ఆకాంక్షల వారధిగా రెన్యువబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణం జరుగనుందని తెలిపారు. రెన్యువబుల్ ఎనర్జీ పరిశ్రమ మాత్రమే కాదని.. ఉద్యమమన్నారు.
భారత క్లీన్ ఎనర్జీ విప్లవానికి శంకుస్థాపన చేశామని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో ప్రతిరోజూ నాలుగు పీక్ గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. మొదటి దశలో RENEW 587 MWP సౌరశక్తి, 250 MWH పవన శక్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 100 శాతం మేడ్ ఇన్ ఇండియా సోలార్ ప్యానెల్స్‌ను వినియోగిస్తామని, సోలార్ ప్యానెల్స్ క్లీనింగ్ కోసం వాటర్ లెస్ రోబోటిక్ వినియోగం ఉంటుందన్నారు. ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి అనుగుణంగా ప్రాజెక్ట్ రూపకల్పన జరిగిందన్నారు.