న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు కఠినమైన ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం ఈ ఆంక్షలు అమల్లోకి తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.
నేడు రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు నగరంలోని కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. ముఖ్యంగా నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్ ప్రాంతాలకు నో ఎంట్రీ విధించారు. ఈ మార్గాలపై సాధారణ వాహనాలను పూర్తిగా నిషేధించారు.
అదేవిధంగా బేగంపేట్, టోలీచౌకి ఫ్లైఓవర్లను మినహాయించి మిగిలిన అన్ని ఫ్లైఓవర్లను మూసివేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని పోలీసులు సూచించారు.
పీవీ ఎక్స్‌ప్రెస్ వేపైకి వెళ్లాలంటే తప్పనిసరిగా ఫ్లైట్ టికెట్ ఉంటేనే అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా వెళ్లే వాహనాలను అక్కడికక్కడే వెనక్కి పంపిస్తామని హెచ్చరించారు.
ఇక నగర భద్రతను దృష్టిలో ఉంచుకుని, నేడు రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు హైదరాబాద్ సిటీలోకి ప్రైవేట్ బస్సులకు నో ఎంట్రీ విధించారు.
