హైదరాబాద్ మహానగరంలోని రోడ్లపై విద్యుత్ స్తంభాలు, కరెంట్ వైర్లు విచ్చలవిడిగా కనిపిస్తుంటాయి. చిన్న వర్షం పడినా రోడ్డు మీద నుంచి వెళ్లాలంటే ప్రజలు భయపడిపోతున్నారు.
ఒక్క స్తంభానికి వందల సంఖ్యలో కేబుల్ వైర్లు ఇళ్లు, కాలనీలు, అపార్ట్ మెంట్ సందల్లోంచి లాగుతున్నారు. దీంతో చాలామంది విద్యుదాఘాతంతో మృతి చెందుతున్నారు. వర్షాకాలంలో ఈ సమస్య మరింత పెరుగుతోంది. వర్షాలకు కరెంట్ పోవడం, గాలులకు విద్యుత్ తీగలు తెగి ఇళ్లు, కాలనీల మధ్య పడిపోవడం.. ఇలాంటి సమస్యలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సమస్యకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేందుకు రాష్ట్ర కేబినెట్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ నగర ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే బెంగుళూరులో అండర్ గ్రౌండ్ విద్యుత్తు కేబుల్ సిస్టమ్ ఉంది. ఇటీవలే అక్కడ అమలు చేసిన విధానాన్ని అధికారులు అధ్యయనం చేసి వచ్చారు. అక్కడ అమలు చేసిన విధానం ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకు దాదాపు రూ. 14వేల 725 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనిపై త్వరలోనే కసరత్తు ప్రారంభించనుంది.
హైదరాబాద్ నగరాన్ని విద్యుత్ సర్కిళ్ల వారీగా మూడు విభాగాలుగా విభజించుకొని.. ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని తాజాగా రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. విద్యుత్ తో పాటు టీ ఫైబర్, వివిధ కేబుల్ నెట్‌వర్క్ వైర్స్ అన్నీ.. అండర్ గ్రౌండ్‌లోనే ఉండేలా చేయాలని, ఆ కంపెనీలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించింది.
మేడ్చల్, హబ్సిగూడ, రంగారెడ్డి పరిధిలోని సైబర్ సిటీ, రాజేంద్ర నగర్, సరూర్ నగర్ జోన్ల పరిధిలో ఓవర్ హెడ్ లైన్లు ఉన్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. వర్షాలు, ఈదురుగాలులకు అవి తెగి రోడ్డుపై పడి ప్రజల మరణాలకు కారణం అవుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చాలానే వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అలాగే హైదరాబాద్ లోని ఎక్కడెక్కడ భూగర్భ కేబుళ్లను ఏర్పాటు చేయాలనే దానిపై ఇప్పటికే అధికారులు ఓ అంచనాకు వచ్చినట్లు స్పష్టం అవుతోంది. త్వరలోనే దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు జరగనుంది
హైదరాబాద్ వైర్ లెస్ గా మారబోతుందా?.. అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ సాధ్యమేనా.?
హైదరాబాద్… ఇప్పుడు గ్లోబల్ సిటీగా ఎదుగుతోంది. అయితే, నగరంలో ఎటు చూసినా గాలిలో వేలాడుతున్న కేబుల్స్, వైర్ల జంక్షన్లు నగర సౌందర్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
ముఖ్యంగా విద్యుత్ వైర్లు, ఇంటర్నెట్ కేబుల్స్ మరియు కమ్యూనికేషన్ లైన్ల గందరగోళం నిత్య సమస్యగా మారుతోంది. గాలిలో వేలాడుతున్న ఈ ట్యాంగిల్డ్ వైర్స్ కేవలం నగర అందాన్ని దెబ్బతీయడమే కాదు, యాక్సిడెంట్లకు కూడా కారణం అవుతున్నాయి. ఇక వర్షాకాలంలో ఈ ఓవర్‌హెడ్ లైన్స్ నిర్వహణ అనేది పెద్ద టాస్క్గా మారుతోంది.
ఈ సమస్యకు పెర్మనెంట్ సొల్యూషన్ ఒక్కటే – అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్. విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ ఫైబర్, కమ్యూనికేషన్ కేబుల్స్… అన్నీ భూమి కిందకు తరలించబడతాయి. దీనివల్ల నగరానికి గ్లోబల్ స్టాండర్డ్ లుక్ వస్తుంది. అంతేకాదు, వర్షాలు, తుఫానుల సమయంలో విద్యుత్ అంతరాయాలు చాలావరకు తగ్గిపోతాయి. అయితే, ఈ మెగా ప్రాజెక్ట్ అనేది అంత ఈజీ కాదు. అండర్ గ్రౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలంటే భారీ ఖర్చుతో కూడుకున్న పని. ఇప్పటికే డెవలప్ అయిన హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్‌కు అడ్డు లేకుండా డ్రిల్లింగ్, డక్టింగ్ పనులు నిర్వహించడం పెద్ద ఛాలెంజ్.
ప్రతి ప్రాంతంలో భూగర్భ మౌలిక సదుపాయాలు ఒకే విధంగా లేకపోవడం, ఇప్పటికే ఉన్న పైప్‌లైన్స్, ఇతర కేబుల్స్‌ను డిస్టర్బ్ చేయకుండా పని చేయడం అనేది టెక్నికల్‌గా చాలా కాంప్లెక్స్. అయినప్పటికీ, హైదరాబాద్‌ను ఫ్యూచర్ సిటీగా మార్చాలంటే ఈ ట్రాన్సిషన్ తప్పనిసరి. ప్రపంచంలోని ముఖ్యమైన నగరాలు ఇప్పటికే ఈ అండర్ గ్రౌండ్ సిస్టమ్‌ను సక్సెస్ చేశాయి. కాబట్టి, దశలవారీగా ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టడానికి స్పెషల్ ప్లాన్స్, పెద్ద ఎత్తున ఫండింగ్ అవసరం. హైదరాబాద్ వైర్‌లెస్ సిటీగా మారే లక్ష్యం కేవలం ఒక కల కాదు, అది భవిష్యత్ అవసరం కూడా.
