తెలంగాణకు డేంజర్‌ బెల్స్‌.. ఆందోళనకరంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి

  • చరిత్రలో చూడని ‘డీఫ్లేషన్‌’
  • జూన్‌లో ప్రతి ద్రవ్యోల్బణం – 0.93%
  • తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారి
  • కేంద్ర గణాంకాల శాఖ నివేదికలో వెల్లడి
  • ప్రతి ద్రవ్యోల్బణంతో తీవ్ర ఆర్థిక కష్టాలు
  • భూముల ధరలు పతనం, ఉపాధి గల్లంతు
  • ప్రజల కొనుగోలుశక్తి క్షీణించడమే కారణం
  • అందనంత ఎత్తులోనే పెట్రో, కూరగాయలు, నిత్యావసరాలు, సూల్‌, కాలేజీల ఫీజులు
  • ఇలాగే కొనసాగితే ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమే

హైదరాబాద్‌, జూలై 17 (ధర్మఘంట) : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నది. రేవంత్‌రెడ్డి ప్రభుత్వహయాంలో జూన్‌లో తెలంగాణ ఆర్థిక పరిస్థితి ‘డీఫ్లేషన్‌’ (ప్రతి ద్రవ్యోల్బణం) దశలోకి పడిపోయింది. ఈ మేరకు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ (ఎంవోఎస్పీఐ) విడుదల చేసిన తాజా గణాంకాలను బట్టి అర్థమవుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో -1.54 శాతం, నగర ప్రాంతాల్లో -0.45 శాతంతో మొత్తంగా రాష్ట్రంలో ద్రవ్యోల్బణ రేటు -0.93 శాతంగా నమోదైంది. అలా నెగెటివ్‌ ద్రవ్యోల్బణం నమోదైన ఏకైక పెద్ద రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత డీఫ్లేషన్‌ స్థితిలోకి రాష్ట్రం వెళ్లిపోవడం ఇదే మొదటిసారని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇక, ఇదే సమయంలో దేశ ద్రవ్యోల్బణ రేటు 2.10 శాతంగా నమోదైంది. పొరుగున ఉన్న ఏపీలో ద్రవ్యోల్బణ రేటు 0.00 శాతంగా, ఒడిశాలో 0.52 శాతం, బీహార్‌లో 0.75 శాతంగా నమోదైంది. తెలంగాణలో -0.93% ద్రవ్యోల్బణ రేటు.. ప్రజల కొనుగోలు శక్తి క్షీణతకు ఒక హెచ్చరికగా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.

అసలేమిటీ డీఫ్లేషన్‌? ఎందుకు ఆందోళనకరం?

ఆర్థిక వ్యవస్థలో వస్తువులు, సేవల ధరలు సమయానుగుణంగా పెరగడాన్ని ద్రవ్యోల్బణంగా చెప్తారు. ద్రవ్యోల్బణం అధికంగా పెరిగితే.. వస్తువులు, సేవల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. ఒకవేళ ద్రవ్యోల్బణం ఒక పరిధివరకూ తగ్గితే ధరలు తగ్గుతాయని చెప్పొచ్చు. అయితే, అదే ద్రవ్యోల్బణం మైనస్‌లోకి వెళితే అది డీఫ్లేషన్‌ స్టేట్‌ (ప్రతి ద్రవ్యోల్బణ దశ)లోకి జారినట్టు ఆర్థిక నిపుణులు చెప్తారు. అంటే నెగెటివ్‌ ద్రవ్యోల్బణం నమోదు చేసిన రాష్ట్రంలో ధరలు తగ్గడం అటుంచితే.. వస్తు, సేవలను వినియోగించుకొనే ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందని అర్థం చేసుకోవాలి. ఇది ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రమాదకరం. ప్రస్తుతం జూన్‌లో తెలంగాణ ద్రవ్యోల్బణ రేటు మైనస్‌ 0.93 శాతానికి పడిపోయింది. ఇంకా వివరంగా చెప్పాలంటే.. తెలంగాణలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎక్కువగానే ఉన్నాయి. కూరగాయలు, నూనె, నిత్యావసరాల ధరల్లో మార్పు లేదు. సూల్‌, కాలేజీ ఫీజులు కూడా ఏమాత్రం తగ్గలేదు. అయినప్పటికీ ద్రవ్యోల్బణం నెగెటివ్‌కు చేరిందంటే.. వీటిని కొనుగోలు చేసే పౌరుల ఆర్థిక శక్తి తగ్గిపోయిందని అర్థం చేసుకోవాలి. అంటే ప్రజల ఖర్చు సామర్థ్యం క్షీణించినట్టే. వినోదం, టూరిజంపై ప్రజలు చేస్తున్న ఖర్చు తగ్గినట్టు అర్థం చేసుకోవాలి. ఇదే సమయంలో రియల్‌ ఎస్టేట్‌ మారెట్‌ కుప్పకూలి.. వ్యాపార పెట్టుబడులు పూర్తిగా నిలిచిపోయాయని తెలుస్తున్నది. తద్వారా ఉపాధి అవకాశాలకు కూడా గండిపడినట్టే. ఇలాంటి కారణాల వల్లే జూన్‌లో మనదగ్గర డీఫ్లేషన్‌ నమోదైంది. ఇది కేవలం ద్రవ్యోల్బణ నియంత్రణ కాదు.. ఇది ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి సంకేతమని, ఇది గణాంకాల్లో కనిపించే నెగెటివ్‌ నంబర్ల కన్నా చాలా ప్రమాదకరమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పుడు ఏం జరుగొచ్చు?

ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి డీఫ్లేషన్‌ స్టేట్‌లోకి వెళ్లిందంటే అది ఆ రాష్ట్ర ఆదాయంపై మరింత తీవ్రమైన ప్రభావం చూపించవచ్చని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. కొనుగోలు శక్తి క్షీణించడంతో వస్తు, సేవలను ప్రజలు తక్కువగా వినియోగించుకోవడంతో జీఎస్టీ వంటి పన్నుల వసూళ్లు మరింత గణనీయంగా తగ్గుతాయి. ఇది ప్రభుత్వ ఆదాయంపై ఒత్తిడిని పెంచుతుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో క్షీణత వల్ల స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు వంటి ఆదాయ వనరులు కూడా దెబ్బతిన్నట్టే. ఇదే సమయంలో వ్యాపార పెట్టుబడులు నిలిచిపోవడం వల్ల కొత్త ఉపాధి అవకాశాలు లేక యువత నిరాశలో కొట్టుమిట్టాడుతుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నమోదైన డీఫ్లేషన్‌ రైతులను కూడా దెబ్బతీసినట్టే. వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధర లేకపోవడంతో అన్నదాతలు ఆర్థికంగా చితికిపోతారు. వ్యవసాయ రంగంలో డిమాండ్‌ తగ్గడం, మారెట్‌లో అమ్మకాలు తగ్గడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడొచ్చు. ఈ పరిస్థితి రైతుల జీవనోపాధికి సవాల్‌గా మారుతుంది. వ్యాపారాలు సైతం కుదేలవుతుతాయి. డిమాండ్‌ తగ్గడం వల్ల చిన్న, మధ్య తరగతి వ్యాపారాలు మూతపడే ప్రమాదాన్ని మరింత ఎదుర్కోవచ్చు. సేవారంగం మరింత గడ్డుపరిస్థితులను ఎదుర్కొనవచ్చు. వెరసి ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ అనేదే ఉండదు. వస్తు, సేవల కోనుగోళ్లు తగ్గిపోతాయి. తద్వారా ఉత్పత్తి క్షీణించి పెట్టుబడులు నిలిచిపోతాయి. ఉపాధి అవకాశాలు మృగ్యమైపోతాయి.

బయటపడే మార్గాలేంటి?

తెలంగాణ డీఫ్లేషన్‌ ఊబిలో చికుకోవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారింది. ఈ పరిస్థితిని ఎదురోవడానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఆర్థిక ఉద్దీపన చర్యలు, రైతులకు మద్దతు, వ్యాపారాలను ప్రోత్సహించే విధానాలు, పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమాలు చేపడితే ఈ సంక్షోభం నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. ఈ డీఫ్లేషన్‌ ఇలాగే కొనసాగితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలహీనపడే ప్రమాదం ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మంచిదేమీ కాదు

ద్రవ్యోల్బణం మైనస్‌లోకి వెళ్లిందంటే ధరలు తగ్గుతున్నాయని పైకి కనిపించడం శుభవార్తలా అనిపించవచ్చు. కానీ అది నిజంగా ఆర్థిక సంక్షోభానికి సంకేతం. రైతులు పంటలు పండిస్తున్నారేమో కానీ అమ్మలేకపోతున్నారు. షాపులు తెరిచి ఉన్నాయి. కానీ, కొనుగోలుదారులు కనపడటంలేదు. ప్రజలు లగ్జరీలను కాదు, అవసరాలనే తగ్గిస్తున్నారు. పొదుపు కూడా పెరగడం లేదు. భయంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ఖర్చు తగ్గిస్తున్నారు. ఇది ఊరట కాదు.. హెచ్చరిక. డీఫ్లేషన్‌ అంటే.. ఎక్కువ పంట పండించినప్పటికీ రైతుకు దక్కేది కొంతే. దుకాణాలు నిత్యం తెరిచి ఉన్నప్పటికీ అమ్మకాలు జరుగకపోవడమే. ప్రజలు ఆదా చేయడం అటుంచితే.. బతకడానికే నిత్యం పోరాడుతుండాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *