
హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం..
జనజీవనం అస్తవ్యస్తం..!
హైదరాబాద్, ధర్మఘంట, 07 బుధవారం: గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భీకర వర్షం దంచికొడుతోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఎండలు మండిపోతున్నాయి. తీవ్ర ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుంది. కానీ, సాయంత్రానికి వాతావరణం చల్లబడుతోంది. ముఖ్యంగా ప్రస్తుతం నేటి సాయంత్రం నుండి హైదరాబాద్ సిటీలో పెనుగాలులతో కుండపోతగా వర్షం కురుస్తోంది. కుండపోత వర్షం కారణంగా నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది.
వాతావరణంలో వచ్చిన మార్పులతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. లంగర్‌హౌస్, గోల్కొండ, కార్వాన్, జియాగూడ, గుడిమల్కాపూర్, సికింద్రాబాద్, అమీర్ పేట్, ఎర్రగడ్డ, బోయిన్పల్లి, అల్వాల్, బొల్లారంలో వర్షం దంచి కొడుతోంది.

అమీర్ పేట్, జూబ్లీహిల్స్, సుల్తాన్ బజార్, కుత్బుల్లాపూర్, దుండిగల్, బంజారాహిల్స్, ఫిలింనగర్, షేక్‌పేట్, మణికొండ, హైటెక్ సిటీ, బేగం బజార్, గండి మైసమ్మ, సూరారం, కొంపల్లి, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్ నగర్, మల్లంపేట, గాజులరామారం, బహదూర్ పల్లి, ఉప్పల్, నాగోల్, ఎల్బీనగర్, మన్సూరాబాద్, వనస్థలిపురం, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా, డీఆర్ఎఫ్ బృందాలను వాతావరణ శాఖ అలెర్ట్ చేసింది.
ఇదిలా ఉండగా కోఠి, మొహింజాహి మార్కెట్, నాంపల్లి తదితర ప్రాంతాల్లో చిరు జల్లులు ప్రారంభమయ్యాయి. అయా ప్రాంతాల్లో వర్షం మరింత పెరిగే అవకాశం ఉందని అవసరం అయితే తప్ప భయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, మైలర్ దేవ్ పల్లి, అత్తాపూర్, నార్సింగి, గండిపేట్, మణికొండ, పుప్పాలగూడ, బండ్లగూడ జాగిర్, కిస్మత్ పూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
మణికొండ మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాన జోరుగా కురుస్తోండడం వలన ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

క్యూమిలో నింబస్ మేఘాలు కమ్ముకోవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మరో రెండు మూడు గంటల పాటు నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు(Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
మరో రెండు గంటలపాటు హైదరాబాద్‌లో భారీవర్షం కురిసే అవకాశం ఉందని హైడ్రా వెల్లడించింది. ప్రజలు రోడ్లపైకి రావొద్దని, లోతట్టు ప్రాంతాల వైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది.
