ఓయూ బహుజన విద్యార్థి సంఘాలు


ధర్మఘంట, మార్చి 13, హైదరాబాద్ : మాన్యశ్రీ కాన్షిరామ్ 92వ జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాం శేఖర్ ఆధ్వర్యంలో మార్చి 15, 2026న సాయంత్రం 5 గంటలకు రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ మైదానంలో నిర్వహించబడనున్న “బహుజన రాజ్యాధికార యుద్ధభేరి” భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం బహుజన విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
ఈ సందర్భంగా నేడు ఓయూ బహుజన విద్యార్థి సంఘాల ప్రతినిధులు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ తో కలిసి సభకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం “తెలంగాణలో బహుజన రాజ్యం – విద్యార్థుల అంతిమ కర్తవ్యం, భవిష్యత్తు బహుజన రాజకీయాలు” తదితర అంశాలపై ఆయనతో బహుజన విద్యార్థి సంఘాల నాయకులు సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఓయూ బహుజన విద్యార్థి సంఘాల జేఏసీ అధ్యక్షుడు, ఓయూ పీహెచ్డీ పరిశోధన విద్యార్థి మరియు డీబీఎస్ఏ రాష్ట్ర సమన్వయకర్త జంగిలి దర్శన్ మాట్లాడుతూ బహుజన రాజ్యాధికారమే తమ అంతిమ లక్ష్యమని, ఆ లక్ష్య సాధన దిశగా పనిచేస్తున్న ఓయూ బహుజన విద్యార్థి సంఘాలు బడంగ్పేట్లో నిర్వహించబడనున్న బహుజన రాజ్యాధికార యుద్ధభేరి సభకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు.
ఈ సభకు మేధావులు, ప్రొఫెసర్లు, విద్యార్థులు, ఉద్యమకారులు, వాగ్గేయకారులు మరియు సబ్బండ వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. తెలంగాణలో బహుజన రాజ్యాధికారాన్ని సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని జంగిలి దర్శన్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో బీఎస్ఎఫ్ఐ జాతీయ సమన్వయకర్త కరుణాకర్ బహుజన్, ఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వేదాంత్ మౌర్య,, డీబీఎస్ఏ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఇంచార్జి ప్రశాంత్ చిన్నా, డీఎంఎస్ఏ రాష్ట్ర నాయకుడు రాజు, డీబీఎస్ఏ ఓయూ పరిశోధన విద్యార్థి అరవింద్, డీబీఎస్ఏ హైదరాబాద్ కార్యదర్శి మహేష్, బీసీ విద్యార్థి జేఏసీ అధ్యక్షుడు ప్రశాంత్, పూలే అంబేద్కర్ విద్యార్థి సంఘం నాయకుడు ప్రవీణ్, ఓయూ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం రాష్ట్ర నాయకుడు లోకేష్, డీబీఎస్ఏ నాయకులు విష్ణు, కిరణ్, సైదులు తదితరులు పాల్గొన్నారు.
