కులం పేరుతో దాడి చేయడం అమానుషం

కుల వివక్షతో బలైన పసిపాప – నిందితులకు కఠిన శిక్ష విధించాలి.

బాధిత కుటుంబానికి న్యాయం జరగాలి

డి.బి.ఎస్.ఏ స్టేట్ కో ఆర్డినేటర్ జంగిలి దర్శన్ డిమాండ్

ధర్మఘంట, ఫిబ్రవరి 23, హైదరాబాద్ : పసిపాప పైన కులం పేరుతో దాడి చేయడం అమానుషమని, ఇది సమాజానికి మచ్చ అని బి.ఎస్.ఏ రాష్ట్ర సమన్వయకర్త జంగిలి దర్శన్ పేర్కొన్నారు. నేడు దళిత బహుజన స్టూడెంట్ అసోసియేషన్ (డి.బి.ఎస్.ఏ) ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డి.బి.ఎస్.ఏ రాష్ట్ర సమన్వయకర్త జంగిలి దర్శన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో బీసీ చాకలి దంపతులు దర్శనం కోసం ఆలయంలో ప్రవేశిస్తుండగా అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తుల దాడికి రెండు నెలల పసిపాప బలైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో కూడా కులం పేరుతో వివక్షకు గురి కావడం అత్యంత బాధాకరమని, రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. ఈ ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

బాధిత పసిపాప బీసీ చాకలి దంపతులకు న్యాయం జరిగే వరకు డి.బి.ఎస్.ఏ అండగా నిలుస్తుందని తెలిపారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడంతో పాటు కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై ఆధిపత్య కులాలు చేస్తున్న హింసను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఇకముందు కూడా కులం పేరుతో దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని, న్యాయం కోసం ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డి.బి.ఎస్.ఏ మరియు భీం డ్రమ్ నాయకులు వెంకట్, మహేష్, ప్రణయ్, కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *