మీకు 40 ఏళ్లు వచ్చాయా? అయితే, తప్పనిసరిగా కొన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ..
ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజుల్లో ఆకస్మిక గుండె జబ్బులు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి పలు ఆరోగ్య సమస్యలతో చిన్న వయసులోనే చాలా మంది చనిపోతున్నారు. దీనికి అనేక కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా జీవనశైలి సక్రమంగా లేకుంటే వయస్సుతోపాటు, శరీరంలోని అవయవాల పనితీరులోనూ మార్పులు వస్తుంటాయి. అయితే, చాలా మంది నాకేం అవుతుందిలే అనే ధీమాతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. వ్యాధి తీవ్రత లక్షణాలు కనిపించే వరకూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపరు. కానీ, ఒక వ్యక్తి ఫిట్‌గా ఉండటానికి క్రమం తప్పకుండా కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాలి. ఈ ప్రాథమిక పరీక్షలను 40 ఏళ్లు ఉన్న వారు చేయించుకోవడం మంచిదని, తద్వారా ఏమైనా వ్యాధులు ఉంటే త్వరగా చికిత్స తీసుకుని నయం చేసుకునే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 40 ఏళ్ల వయస్సు ఉన్నవారు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షల జాబితాను ఇప్పుడు తెలుసుకుందాం..
1. రక్తపోటు (CBP): రక్తపోటును ఎప్పటికప్పుడు తెలుసుకోవటం చాలా అవసరం. కుటుంబంలో ఎవరికైనా రక్తపోటు ఉంటే వారసులకూ అది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రమం తప్పకుండా రక్తపోటును చెక్ చేసుకుంటుండాలి. సాధారణంగా BP 120/80 mm Hg కంటే తక్కువగా ఉండాలి.
2. మూత్రపిండ పనితీరు పరీక్ష( RFT) : RFT అనేది మూత్రపిండాలు ఎంత బాగా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి వైద్యులు చేసే పరీక్ష. ఇది రక్తం, మూత్ర పరీక్షల ద్వారా మూత్రపిండాల పనితీరును అంచనా వేస్తుంది. ఈ పరీక్ష ద్వారా వాటి ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు.
3. కాలేయ పనితీరు పరీక్ష (LFT): కాలేయ పనితీరు పరీక్ష అనేది కాలేయం ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు చేసే ఒక రక్త పరీక్ష. ఇది కాలేయం ద్వారా ఉత్పత్తి చేయబడే ప్రోటీన్లు, ఎంజైమ్‌లు, ఇతర పదార్థాల స్థాయిలను కొలుస్తుంది. ఈ పరీక్ష ద్వారా కాలేయ వ్యాధి లేదా ఇతర ఆరోగ్య సమస్యలను గుర్తించవచ్చు.
4. థైరాయిడ్ పనితీరు పరీక్ష( Thyroid): బరువు పెరగడం, జుట్టు రాలడం, పీరియడ్స్ ప్రతి నెల రాకపోవడం వంటి సమస్యలు ఉన్నట్లైతే మీరు తప్పనిసరిగా థైరాయిడ్ పరీక్ష చేయించుకోవాలి.
5. పూర్తి మూత్ర పరీక్ష (CUE): మూత్రంలో రక్తం, ప్రోటీన్, గ్లూకోజ్, బ్యాక్టీరియా, ఇతర వ్యాధి సమస్యలను నిర్ధారించడానికి CUE టెస్ట్ చేస్తారు.
6. 2D ఎకో, ECG, TMT: గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి 2D ఎకో, ECG, TMT పరీక్షలు చేస్తారు. ఈ టెస్ట్‌లు చేయడం ద్వారా గుండె సమస్యలు ఏమైనా ఉంటే బయటపడతాయి.
7. మామోగ్రామ్: క్యాన్సర్‌తో సహా రొమ్ము వ్యాధులను గుర్తించడానికి రొమ్ము ఎక్స్-రే పరీక్ష చేస్తారు. సాధారణంగా 40 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళలకు మామోగ్రామ్ పరీక్ష సిఫార్సు చేస్తుంటారు.
8. PSA లేదా ప్రోస్టేట్-నిర్దిష్ట యాంటిజెన్: ప్రోస్టేట్ క్యాన్సర్‌ను పరీక్షించడానికి, దాని పురోగతిని పర్యవేక్షించడానికి మగవారికి ఈ రక్త పరీక్ష చేస్తారు.
9. USG, Chest xray: అల్ట్రాసౌండ్, ఛాతీ ఎక్స్-రే రెండూ ఛాతీలోని నిర్మాణాలను పరిశీలించడానికి ఉపయోగించే వైద్య పరీక్షలు.
10. CA-125 రక్త పరీక్ష: CA-125 అనే పరీక్ష రక్తంలోని ప్రోటీన్ స్థాయిని కొలుస్తుంది. ఈ పరీక్ష అండాశయ క్యాన్సర్ ఉనికిని సూచిస్తుంది .
11. CA 15-3: ఇది రొమ్ము క్యాన్సర్ కణాల ద్వారా ఉత్పత్తి అయ్యే క్యాన్సర్ యాంటిజెన్ 15-3 స్థాయిలను కొలిచే రక్త పరీక్ష.
12. CA 19-9: ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను పర్యవేక్షించడానికి, చికిత్స ప్రభావాన్ని అంచనా వేయడానికి ఉపయోగించే కణితి మార్కర్ రక్త పరీక్ష
13. పాప్ స్మియర్: గర్భాశయ క్యాన్సర్ కోసం చేసే స్క్రీనింగ్ పరీక్ష. ఇందులో సూక్ష్మదర్శిని పరీక్ష కోసం గర్భాశయం నుంచి కణాలను సేకరించడం జరుగుతుంది. ఇది అసాధారణ కణాలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇవి క్యాన్సర్‌కు ముందు లేదా క్యాన్సర్‌గా ఉండవచ్చు. తద్వారా గర్భాశయ క్యాన్సర్‌ను ముందస్తుగా గుర్తించి చికిత్స చేయడానికి వీలు కల్పిస్తుంది.