.ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) ఫైనల్‌కు దూసుకెళ్లింది. పంజాబ్ కింగ్స్‌తో గురువారం ముల్లాన్‌పూర్ వేదికగా ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్-1లో సమష్టిగా రాణించిన ఆర్‌సీబీ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ముందుగా బౌలింగ్‌లో నిప్పులు చెరిగి పంజాబ్ కింగ్స్‌ను తక్కువ స్కోర్‌కు కట్టడి చేసిన ఆర్‌సీబీ.. అనంతరం ఫిల్ సాల్ట్ విధ్వంసంతో సునాయస విజయాన్నందుకుంది. 9 ఏళ్ల తర్వాతా ఫైనల్ చేరిన ఆర్‌సీబీ.. 18 ఏళ్ల తమ కలను సాకారం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. మరోవైపు ఊహించని ఆటతీరుతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న పంజాబ్ కింగ్స్‌కు క్వాలిఫయర్-2 రూపంలో మారో అవకాశం ఉంది. ఈ మ్యాచ్ హోరా హోరీగా సాగుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ పంజాబ్ కింగ్స్ 14.1 ఓవర్లలో 101 పరుగులకు కుప్పకూలింది. పంజాబ్ బ్యాటర్లలో మార్కస్ స్టోయినీస్(17 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 26) మినహా అంతా విఫలమయ్యారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య(7), ప్రభ్ సిమ్రాన్ సింగ్(18)తో పాటు జోష్ ఇంగ్లీస్(4), శ్రేయస్ అయ్యర్(2), నెహాల్ వధేరా(8) తీవ్రంగా నిరాశపరిచారు. ఆర్‌సీబీ బౌలర్లలో జోష్ హజెల్ వుడ్(3/21), సుయాశ్ శర్మ(3/17) మూడేసి వికెట్లు తీయగా.. యశ్ దయాల్(2/26) రెండు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపెర్డ్‌కు చెరో వికెట్ దక్కింది.
అనంతరం ఆర్‌సీబీ 10 ఓవర్లలోనే 2 వికెట్లకు 106 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఫిల్ సాల్ట్(27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 56 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించగా.. రజత్ పటీదార్(8 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 15 నాటౌట్) విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. పంజాబ్ బౌలర్లలో కైల్ జెమీసన్, ముషీర్ ఖాన్ చెరో వికెట్ తీసారు.
105 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో ఆర్‌సీబీకి శుభారంభం దక్కింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(12) త్వరగానే ఔటైనా.. తొలి వికెట్‌కు 30 పరుగుల భాగస్వామ్యం దక్కింది. కైల్ జెమీసన్ కాస్త కట్టడిగా వేసినా.. క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్(19)తో కలిసి ఫిల్ సాల్ట్ దూకుడుగా ఆడాడు. తనకే సాధ్యమైన బౌండరీలతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. దాంతో పవర్ ప్లేలోనే ఆర్‌సీబీ వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. 54 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ముషీర్ ఖాన్ విడదీసాడు. మయాంక్ అగర్వాల్‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి రజత్ పటీదార్ రాగా.. ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం అతను అదే జోరు కొనసాగించగా.. రజత్ పటీదార్ సిక్సర్‌తో విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.