ప్లేఆఫ్స్‌లో గుజరాత్, బెంగుళూరు, పంజాబ్
గుజరాత్ టైటాన్స్ ఒక్క దెబ్బతో మూడు బెర్తులు ఖాయం చేసింది. ఆదివారం దిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 200 లక్ష్యాన్ని ఒక్క వికెట్టూ కోల్పోకుండా, ఒక ఓవర్ మిగిలుండగానే ఛేదించేసిన టైటాన్స్.. 18 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. నాలుగు జట్లకు మించి 17, అంతకంటే ఎక్కువ పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (17), పంజాబ్ కింగ్స్ (17) సైతం ముందంజ వేశాయి. ఇక చివరి బెర్తు కోసం ముంబయి, దిల్లీ, లఖ్‌నోల మధ్య పోటీ నెలకొంది.
గుజరాత్ టైటాన్స్ అదరగొట్టింది. తొమ్మిదో విజయంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్‌ను 10 వికెట్ల తేడాతో చిత్తు చేసిన ఆ జట్టు.. ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టింది. రాహుల్ (112 నాటౌట్; 65 బంతుల్లో 14×4, 4×6) మెరుపు శతకంతో మొదట దిల్లీ 3 వికెట్లకు 199 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (108 నాటౌట్; 61 బంతుల్లో 12×4, 4×6), శుభ్‌మన్ గిల్ (93 నాటౌట్; 53 బంతుల్లో 3×4, 7×6) చెలరేగడంతో లక్ష్యాన్ని గుజరాత్ 19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా అలవోకగా ఛేదించింది.
ఛేదన అలవోకగా..: లక్ష్యం చిన్నదేమీ కాదు. కానీ సూపర్ ఫామ్‌లో ఉన్న గుజరాత్ ఓపెనర్లు సాయి సుదర్శన్, కెప్టెన్ గిల్ మరోసారి అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. వీళ్లిద్దరూ విపరీతంగా ఏమీ రెచ్చిపోలేదు.. అలవోకగా బౌండరీలు రాబడుతూ ప్రశాంతంగా పనిపూర్తి చేశారు. మొదట్లో సుదర్శన్ దూకుడు ప్రదర్శిస్తే.. ఆ తర్వాత గిల్ రెచ్చిపోయాడు. ఆటగాళ్లిద్దరూ చక్కని షాట్లతో అలరించారు. ఆరంభంలో దూకుడుగా ఆడి ఇన్నింగ్స్‌కు ఊపునిచ్చింది సుదర్శనే. గిల్ ఎక్కువగా సింగిల్స్ తీస్తూ అతడికి సహకరించాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో నటరాజన్ బౌలింగ్‌లో సుదర్శన్ వరుసగా 6, 4, 4 బాదేశాడు. ఆ తర్వాత కూడా చక్కగా బ్యాటింగ్ చేసిన అతడు.. ఎనిమిదో అక్షర్ బౌలింగ్‌లో ఫోర్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రమంగా గిల్ గేర్ మార్చగా.. సుదర్శన్ అతడికి సహకరించాడు. కళ్లు చెదిరే షాట్లతో అలరించిన గిల్.. అక్షర్, కుల్‌దీప్, విప్రాజ్ ఓవర్లలో సిక్స్‌లు దంచేశాడు. 11 ఓవర్లు ముగిసే సరికి 104/0తో టైటాన్స్ లక్ష్యం దిశగా సాగింది. గిల్ మరింత జోరుగా పెంచడం, మరోవైపు సుదర్శన్ కూడా బ్యాటుకు పనిచెప్పడంతో 15 ఓవర్లు ముగిసే సరికి 154/0తో ఆ జట్టు తిరుగులేని స్థితిలో నిలిచింది. ఆఖరి 5 ఓవర్లలో 46 పరుగులు చేయాల్సిన స్థితిలో లక్ష్యం తేలికైపోయింది. ఆ తర్వాత కూడా దిల్లీ బౌలర్లు ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. అలవోకగా షాట్లు ఆడుకుంటూ పోయిన గిల్, సుదర్శన్ నాటకీయతకు అవకాశం లేకుండా పని పూర్తి చేశారు. సుదర్శన్ 56 బంతుల్లో శతకాన్నందుకున్నాడు.
మెరిసిన రాహుల్: అంతకుముందు దిల్లీ ఇన్నింగ్స్‌లో రాహుల్ ఆటే హైలైట్. నెమ్మదిగా మొదలెట్టినా.. క్రమంగా వేగాన్ని అందుకున్న అతడు, ఆ జట్టు గట్టి లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు. దిల్లీ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌గా వచ్చిన రాహుల్.. మొదట్లో షాట్లు ఆడేందుకు కష్టపడ్డాడు. గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మరో ఓపెనర్ డుప్లెసిస్ (5) కూడా ఇబ్బందిపడ్డాడు. చివరికి నాలుగో ఓవర్లో అర్షద్ ఖాన్ బౌలింగ్‌లో అతడు వెనుదిరిగాడు. ఆ ఓవర్ ముగిసే సరికి దిల్లీ స్కోరు 19 పరుగులే. అయితే ఎదుర్కొన్న తొలి 18 బంతుల్లో 19 పరుగులే చేసిన రాహుల్.. ఆ తర్వాత జోరు పెంచాడు. ఆరో ఓవర్లో చెలరేగిపోయాడు. రబాడ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, ఫోర్ దంచేశాడు. మరోవైపు ప్రసిద్ధ్ ఓవర్లో పోరెల్ (30; 19 బంతుల్లో 1×4, 3×6) ఫోర్, సిక్స్ కొట్టేశాడు. రషీద్ బంతిని బౌండరీకి తరలించి రాహుల్ అర్ధశతకం (35 బంతుల్లో) పూర్తి చేయగా.. 10 ఓవర్లు ముగిసే సరికి దిల్లీ 81/1తో నిలిచింది. ఆ తర్వాత రబాడ ఓవర్లో పోరెల్, సిక్స్ చెరో సిక్స్ దంచారు. సాయికిశోర్ ఓవర్లోనూ ఓ సిక్స్ కొట్టిన పోరెల్.. ఆ తర్వాతి బంతికే వెనుదిరగడంతో 90 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ దశలో అక్షర్ పటేల్ (25; 16 బంతుల్లో 2×4, 1×6)తో రాహుల్ మరో విలువైన భాగస్వామ్యాన్ని (26 బంతుల్లో 45) నమోదు చేశాడు. అతడు సాయికిశోర్ బౌలింగ్‌లో వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. అక్షర్ కూడా బ్యాట్ ఝళిపించాడు. అక్షర్ 17వ ఓవర్లో ఔటైనా.. స్టబ్స్ (21 నాటౌట్)తో కలిసి రాహుల్ చెలరేగడంతో ఆఖరి 3 ఓవర్లలో దిల్లీ 41 పరుగులు రాబట్టింది. ప్రసిద్ధ్ వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో సూపర్ సిక్స్‌తో 98కు చేరుకున్న రాహుల్.. ఫోర్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాహుల్-స్టబ్స్ జంట అభేద్యమైన 4వ వికెట్‌కు 22 బంతుల్లో 48 పరుగులు జోడించింది.
దిల్లీ ఇన్నింగ్స్: రాహుల్ నాటౌట్ 112; డుప్లెసిస్ (సి) సిరాజ్ (బి) అర్షద్ 5; పోరెల్ (సి) బట్లర్ (బి) సాయికిశోర్ 30; అక్షర్ (సి) సాయికిశోర్ (బి) ప్రసిద్ధ్ 25; స్టబ్స్ నాటౌట్ 21; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 199; వికెట్ల పతనం: 1-16, 2-106, 3-151; బౌలింగ్: సిరాజ్ 4-0-37-0; అర్షద్ ఖాన్ 2-0-7-1; రబాడ 2-0-34-0; ప్రసిద్ధ్‌కృష్ణ 4-0-40-1; రషీద్ ఖాన్ 4-0-32-0; సాయికిశోర్ 4-0-47-1
గుజరాత్ ఇన్నింగ్స్: సాయి సుదర్శన్ నాటౌట్ 108; గిల్ నాటౌట్ 93; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (19 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 205; బౌలింగ్: అక్షర్ 3-0-35-0; నటరాజన్ 3-0-49-0; ముస్తాఫిజుర్ 3-0-24-0; చమీర 2-0-22-0; విప్రాజ్ నిగమ్ 4-0-37-0; కుల్‌దీప్ 4-0-37-0