ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా విజయం

తెలుగు తేజం తిలక్ వర్మ(53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో బీభత్సం

ఆసియా కప్ ఫైనల్లో టీమిండియాదే విజయంఆసియా కప్‌ను భారత్ గెలుచుకుంది. ఫైనల్‌లో పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించిన టీం ఇండియాకు. ఈ టోర్నమెంట్‌లో ఇది తొమ్మిదవ టైటిల్ విజయం.41 ఏళ్ళ ఆసియా కప్ చరిత్రలో ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య తొలిసారి ఫైనల్

దుబాయ్, 29 సెప్టెంబర్ 2025 (ధర్మఘంట): ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన భారత్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. తెలుగు తేజం తిలక్ వర్మ(53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో టీమిండియా ఓటమెరుగని జట్టుగా టైటిల్ అందుకుంది. 9వ ఆసియాకప్‌ను ఖాతాలో వేసుకుంది.

భారత్ నిర్దేశించిన 147 పరుగుల లక్ష్యాన్ని 20వ ఓవర్ నాలుగో బంతికి చేరుకుంది. రింకు సింగ్ ఫోర్ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించాడు. తిలక్ వర్మ 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

13వ ఓవర్లో సంజు శాంసన్ 24 పరుగులు చేసి అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో అబ్రార్ తిలక్, శాంసన్‌ల యాభై పరుగుల భాగస్వామ్యాన్ని బ్రేక్ చేశాడు. పవర్ ప్లేలో శుభ్మాన్ గిల్ 12 పరుగులకు, సూర్యకుమార్ యాదవ్ 1 పరుగులకు, అభిషేక్ శర్మ 5 పరుగులకు ఔట్ అయ్యారు.

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న భారత్. పాకిస్తాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లతో అత్యధిక వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. పాకిస్తాన్ తరఫున సాహిబ్జాదా ఫర్హాన్ 57 పరుగులతో అత్యధిక స్కోరు సాధించాడు.

ఈ ఓటమిని జీర్ణించుకోవడం కష్టం… సల్మాన్ అలీ అఘా

బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా అన్నాడు. బ్యాటింగ్ కాస్త మెరుగ్గా చేసి ఉంటే విజయం సాధించేవాళ్లమని చెప్పాడు. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన సల్మాన్ అలీ అఘా.. వీలైనంత త్వరగా తమ బ్యాటింగ్‌ను మెరుగుపర్చుకోవాలని అభిప్రాయపడ్డాడు. ఫైనల్లో ఓడినా..తమ జట్టు ప్రదర్శన పట్ల గర్వంగా ఉందని చెప్పాడు. ‘ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం. బ్యాటింగ్ వైఫల్యం మా విజయవకాశాలను దెబ్బతీసింది. మా బ్యాటింగ్‌లో మేం వరుసగా వికెట్లు కోల్పోయాం.

బౌలింగ్‌లో అద్భుతంగా రాణించినప్పటికీ.. బోర్డుపై సరిపడా పరుగులు లేవు. స్ట్రైక్‌ రొటేట్ చేయకుండా వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాం. మేం మ్యా బ్యాటింగ్‌ను వీలైనంత త్వరగా సరిదిద్దుకోవాలి. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. చివరి 6 ఓవర్లలో భారత్‌కు 63 పరుగులు అవసరమైనప్పుడు కూడా మేమే గెలుస్తామని అనుకున్నా. కానీ బ్యాటింగ్ వైఫల్యం మాకు తీరని నష్టం చేసింది. ఈ మ్యాచ్‌లో ఓడినా జట్టు పోరాడిన తీరు పట్ల గర్వంగా ఉంది. మేమ మరింత కష్టపడి భవిష్యత్తులో మెరుగైన ప్రదర్శన చేస్తాం.’అని సల్మాన్ అలీ అఘా చెప్పుకొచ్చాడు.

తిప్పేసిన కుల్దీప్.. గెలిపించిన తిలక్

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు కుప్పకూలింది. సహిబ్‌జాద ఫర్హాన్(38 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. ఫకార్ జమాన్(35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46) తృటిలో అర్థశతకాన్ని చేజార్చుకున్నాడు. మిగతా బ్యాటర్లలో సైమ్ అయుబ్(14) మినహా మరే బ్యాటర్ డబుల్ డిజిట్ స్కోర్ చేయలేదు. కుల్దీప్ యాదవ్‌(4/30)నాలుగు వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించగా.. వరుణ్ చక్రవర్తీ(2/30), అక్షర్ పటేల్(2/26), జస్‌ప్రీత్ బుమ్రా(2/25) రెండేసి వికెట్లు పడగొట్టారు. దురదృష్టవశాత్తూ శ్రీలంకతో ఆడిన మ్యాచ్ లో గాయపడిన హార్దిక్ పాండ్య ఈ ఫైనల్ మ్యాచ్ కి దూరం అయ్యాడు.

అనంతరం భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసి గెలుపొందింది. తిలక్ వర్మ అజేయ హాఫ్ సెంచరీకి తోడుగా.. శివమ్ దూబే(22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), సంజూ శాంసన్(21 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 24) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో ఫహీమ్ అష్రఫ్(3/29) మూడు వికెట్లు తీయగా.. షాహిన్ షా అఫ్రిది, అబ్రర్ అహ్మద్ తలో వికెట్ తీసారు.

టాప్-3 విఫలం..

లక్ష్య ఛేదనలో టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు. విధ్వంసకర బ్యాటింగ్‌తో టోర్నీ ఆసాంతం చెలరేగిన అభిషేక్ శర్మ కీలక మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసాడు. ఫహీమ్ అష్రఫ్ వేసిన రెండో ఓవర్‌ తొలి బంతికే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. షాహిన్ అఫ్రిది వేసిన మూడో ఓవర్‌లో సల్మాన్ అలీ అఘా స్టన్నింగ్ క్యాచ్‌కు సూర్యకుమార్ యాదవ్(1) పెవిలియన్ చేరాడు. ఫహీమ్ అష్రఫ్ వేసిన మరుసటి ఓవర్‌లో స్టెప్ ఔటై బౌండరీ బాదిన శుభ్‌మన్ గిల్.. అదే తరహా షాట్‌తో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఎప్పుడు వచ్చామన్నది కాదు… విన్నింగ్ షాట్ కొట్టమా లేదా: రింకూ సింగ్

20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ వర్మ ఆదుకున్నాడు. సంజూ శాంసన్, శివమ్ దూబే, తిలక్ వర్మ సాయంతో టీమిండియాకు విజయ తిలకం దిద్దాడు.

ఆఖరి ఓవర్‌లో టీమిండియాకు 10 పరుగులు అవసరమవ్వగా.. తిలక్ వర్మ సిక్స్ బాది, సింగిల్ తీయగా.. రింకూ సింగ్ బౌండరీ బాది విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ టోర్నీ మొత్తంలో ఒకే ఒక్క బంతి ఆడిన రింకూ సింగ్.. విన్నింగ్ షాట్‌తో మ్యాచ్ ఫినిషర్‌గా తన సత్తా చాటుకున్నాడు. మ్యాచ్ అనంతరం ఇదే విషయాన్ని మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రస్తావించగా.. రింకూ సింగ్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు. ‘ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. విన్నింగ్ షాట్ కొట్టమా లేదా’అని తెలిపాడు.

‘ఎన్ని బంతులు ఆడామన్నది అనవసరం. ఈ ఒక్క బాల్ ముఖ్యం. జట్టు విజయానికి ఒక పరుగు కావాలి. నేను ఫోర్ కొట్టాను. నేను ఒక ఫినిషర్‌ అని అందరూ అంటారు. ఈ రోజు నాకు ఆ అవకాశం లభించింది. టీమ్ గెలిచింది. కాబట్టి చాలా సంతోషంగా ఉంది.’అని రింకూ సింగ్ చెప్పుకొచ్చాడు.

పాక్‌కు కౌంటరిచ్చిన బుమ్రామ్యాచ్‌లో పాక్‌ బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌ చేసిన ఓవరాక్షన్‌కు టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా కౌంటరిచ్చాడు. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో అద్భుతమైన యార్కర్‌తో హరిస్ రౌఫ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా.. విమానం కూలిపోయినట్లు సంజ్ఞ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. రౌఫ్‌కు సరైన సమాధానం చెప్పావంటూ భారత అభిమానులు బుమ్రాను ప్రశంసిస్తున్నారు.

సూపర్‌-4 మ్యాచ్‌లో రౌఫ్‌ ఫీల్డింగ్‌ చేసే సమయంలో విమానం క్రాష్‌ అయినట్లు సంజ్ఞలు చేశాడు. అలాగే ఆరు సంఖ్యను సూచిస్తూ చేతి వేళ్లను ప్రదర్శించాడు. రౌఫ్‌ చర్యలపై బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేయగా.. అతనికి 30 శాతం మ్యాచ్‌ ఫీజ్‌ను జరిమానాగా విధించారు.

అదే మ్యాచ్‌లో మరో పాక్‌ ఆటగాడు కూడా అభ్యంతరకంగా ప్రవర్తించాడు. ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం బ్యాట్‌ను గన్‌లా భావిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇతనిపై కూడా బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అయితే ఫర్హాన్‌ను ఐసీసీ మందలింపుతో వదిలిపెట్టింది.

సరికొత్త సంప్రదాయం..

టాస్‌ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇరు జట్ల కెప్టెన్లతో మాట్లాడేందుకు ఇద్దరు ప్రతినిధులు ఏర్పాటు చేయబడ్డారు.

సాధారణంగా ఏ మ్యాచ్‌కైనా టాస్‌ సమయంలో ఒకరే ప్రతినిధి ఇద్దరు కెప్టెన్లతో మాట్లాడతాడు. అయితా ఈసారి అలా కాకుండా పాకిస్తాన్‌ (Pakistan) కెప్టెన్‌తో ఒకరు, భారత కెప్టెన్‌తో మరొకరు మాట్లాడేందుకు ఏర్పాటు చేయబడ్డాడు. టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌తో భారత్‌కు చెందిన రవిశాస్త్రి మాట్లాడగా.. పాకిస్తాన్‌ కెప్టెన్‌ సల్మాన్‌ అఘాతో అదే దేశానికి చెందిన వకార్‌ యూనిస్‌ సంభాషించాడు.

టాస్‌ అనంతరం టీమిండియా కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ మరోసారి పాక్‌ కెప్టెన్‌తో హ్యాండ్‌ షేక్‌కు దూరంగా ఉన్నాడు. టాస్‌ సమయంలో ఇద్దరు ప్రతినిధుల ఐడియాను బీసీసీఐ ప్రతిపాదించినట్లు తెలిసింది.

ట్రోఫీని నిరాకరించిన భారత్.. 

విజేతగా నిలిచిన టీమిండియా.. ట్రోఫీని స్వీకరించేందుకు నిరాకరించింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఛైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) అధ్యక్షుడైన మోహ్‌సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించలేమని చెబుతూ..ఫైనల్ వేడుకను బహిష్కరించింది. ఈ క్రమంలోనే మ్యాచ్ అనంతరం హైడ్రామా చోటు చేసుకుంది.

పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తుల చేతుల మీదుగా టైటిల్ స్వీకరించలేమని భారత్ స్పష్టం చేయడంతో ఫైనల్ వేడుక గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. చివరకు పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ కార్యక్రమం ప్రారంభం కాగా.. పాకిస్థాన్ ఆటగాళ్లు తమ రన్నరప్ అవార్డ్స్ స్వీకరించారు. అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ను తిలక్ వర్మ, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్‌ను అభిషేక్ శర్మ అందుకున్నారు.

ఈ అవార్డ్స్ అందుకున్న అనంతరం హోస్ట్ సైమన్ డౌల్‌తో మాట్లాడారు. పాకిస్థాన్ కెప్టెన్ కూడా తమ ఓటమిపై స్పందించాడు. ఆ తర్వాత సైమన్ డౌల్.. ఫైనల్ వేడుక ముగిసిందని, టైటిల్ స్వీకరించేందుకు టీమిండియా సుముఖంగా లేదని చెప్పారు. దాంతో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడకుండానే ఫైనల్ వేడుక ముగిసింది. ఆసియా కప్ 2025 ట్రోఫీని టీమిండియా తర్వాత తీసుకుంటుందా? ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కే వదిలేస్తుందా? అనేది చూడాలి.

ఫైనల్ వేడుక ముగిసిన అనంతరం టీమిండియా ఆటగాళ్లు ట్రోఫీ లేకుండా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఫైనల్ వేడుక వేదికపై ఉండి ట్రోఫీ చేతిల్లో ఉన్నట్లు ఊహించుకొని సంబరాలు జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ట్రోఫీ లేకుండా ఫొటోలకు ఫోజులిచ్చారు.

పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలోనే పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి చేతుల మీదుగా టైటిల్ స్వీకరించేందుకు టీమిండియా నిరాకరించింది. పాకిస్థాన్ ఆటగాళ్లకు టీమిండియా కనీసం కరచాలనం కూడా చేయలేదు. వారితో ఫొటోషూట్‌లో కూడా పాల్గొనలేదు. ఐసీసీ, ఏసీసీ రూల్స్ నేపథ్యంలోనే పాకిస్థాన్‌తో మ్యాచ్‌లు ఆడామనే విషయాన్ని భారత్ తమ చర్యల ద్వారా ప్రపంచానికి తెలియజేసింది. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవనే విషయాన్ని స్పష్టం చేసింది.

ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆపరేషన్ తిలక్: ప్రధాని మోదీ

టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్లో టీమిండియా విజయం సాధించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. మైదానంలో భారత ఆటగాళ్ల పోరాటాన్ని కొనియాడుతూ ట్వీట్ చేశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆపరేషన్ తిలక్ అనే అర్థం వచ్చేలా ట్వీట్‌లో పేర్కొన్నారు.’క్రీడా మైదానంలోనూ ఆపరేషన్ సిందూర్.. ఫలితం మాత్రం మారలేదు. భారత్‌దే గెలుపు. మన క్రికెటర్లకు అభినందనలు’అని మోదీ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

ఆసియా కప్ ఫైనల్: విజేతకు రూ. 2.6 కోట్లు

టోర్నీలో విజేతగా నిలిచిన టీమిండియా జట్టుకు రూ. 2.6 కోట్ల ప్రైజ్ మనీ లభించనుంది. ఇది గత ఎడిషన్ కంటే రెట్టింపు. 2023లో విజేతగా నిలిచిన భారత్‌కు రూ. 1.5 కోట్లు దక్కాయి. రన్నరప్‌కు రూ.1.3 కోట్లు అందనున్నాయి, గతంలో ఇది రూ. 82 లక్షలు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌కు రూ. 12.5 లక్షలు కేటాయించారు.

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(సి), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(w), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *