కుర్రాళ్ళు కుమ్మేశారు

అండర్-19 ప్రపంచ కప్ విజేత భారత్

టీమిండియా రికార్డు స్థాయిలో ఆరోసారి సాధించిన టైటిల్

అండర్-19 ప్రపంచ కప్ (World Cup-2026)లో యువ భారత్ చరిత్ర సృష్టించింది. నేడు (శుక్రవారం) జరిగిన తుది పోరులో ఇంగ్లాండ్ జట్టును టీమిండియా చిత్తుగా ఓడించి.. విశ్వ విజేతగా నిలిచింది. ఫైనల్‌లో భారత జట్టు 100 పరుగుల తేడాతో ఇంగ్లీష్ జట్టును ఓడించింది. దీంతో ఆరోసారి ప్రపంచ కప్‌ను యంగ్ ఇండియా ముద్దాడింది. హరారే వేదికగా జరిగిన ఈ టైటిల్ పోరులో భారత్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. 14 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ (175) విధ్వంసకరమైన బ్యాటింగ్ చేసి.. భారత్ విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.

చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్ రికార్డు బ్రేక్

అండర్ – 19 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు జూలు విధిల్చారు. టాస్ గెలిచిన తొలుత బ్యాటింగ్ చేసిన భారత యువ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అయితే కనీవినీ ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించాడు.

హరారే స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఓపెనర్ ఆరోన్ జార్జ్ త్వరగా ఔటైనప్పటికి వైభవ్ మాత్రం కెప్టెన్ ఆయూష్ మాత్రేతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతడి బ్యాటింగ్ చూసి ప్రత్యర్ది బౌలర్లు గజగజ వణికిపోయారు. ఈ క్రమంలో అతడు కేవలం 55 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

ఓవరాల్‌గా సూర్యవంశీ 80 బంతుల్లో 175 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, 15 సిక్సర్లు ఉన్నాయి. అతడితో పాటు మాత్రే(53), అభిజ్ఞాన్ కుండు(40), కనిష్క్ చౌహాన్(37) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ మింటో మూడు వికెట్లు పడగొట్టగా.. సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ తలా రెండు వికెట్లు సాధించారు.

ధోనీ తర్వాత. భారత క్రికెట్‌కు వైభవ్ సూర్యవంశీనే!.

కేవలం 14 ఏళ్ల వయసులోనే ‘రికార్డ్ బ్రేకర్’గా అవతరించిన వైభవ్ సూర్యవంశీ, అండర్-19 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌లో తుఫాను ఇన్నింగ్స్‌తో ప్రపంచ క్రికెట్‌ను విస్మయానికి గురి చేశాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన ఈ టైటిల్ పోరులో ఆయన కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు సాధించి చరిత్ర సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ ఒకే ఇన్నింగ్స్‌లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. దశాబ్దాల క్రితం ఎంఎస్ ధోనీ భారత క్రికెట్‌లో బీహార్‌కు ఒక ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చారు. ఉమ్మడి బీహార్‌లో జన్మించిన ధోనీ తన కెరీర్‌లో అనేక రికార్డులు నెలకొల్పడమే కాకుండా, కెప్టెన్‌గా భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలను అందించి ‘కెప్టెన్ కూల్’గా చిరస్థాయిగా నిలిచారు.

అయితే ఇప్పుడు బీహార్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోందంటే దానికి ప్రధాన కారణం వైభవ్ సూర్యవంశీనే. ధోనీ నిస్సందేహంగా గొప్ప కెప్టెన్ అయినప్పటికీ, వరల్డ్ కప్ ఫైనల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేయడం, కేవలం 80 బంతుల్లో 175 పరుగులు సాధించడం, అందులోనూ 150 పరుగులు పూర్తిగా బౌండరీల ద్వారానే రాబట్టడం అనేది 14 ఏళ్ల వయసులో అసాధారణమైన ఘనతగా నిలిచింది. ఇలాంటి ఇన్నింగ్స్‌ను ధోనీ కూడా తన కలల్లో ఊహించి ఉండకపోవచ్చు. అయితే నేడు వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ వంటి యువ ఆటగాళ్లు తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని శాసిస్తున్నారంటే, ఆ దూకుడైన ఆటకు పునాది వేసిన వారిలో ధోనీ కూడా ఒకరని చెప్పాల్సిందే.

ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్ మూడు ప్రధాన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా నిలవడమే కాకుండా, యూత్ వన్డే చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 15 సిక్సర్లు బాదిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు, కేవలం 71 బంతుల్లోనే 150 పరుగుల మైలురాయిని చేరుకొని యూత్ వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన 150 పరుగుల రికార్డును కూడా తన పేరిట నమోదు చేసుకున్నాడు.

టీమిండియా సరికొత్త చరిత్ర

అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. గతంలో ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. అండర్‌-19 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్‌పై ఆసీస్ 253 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌లో 411 పరుగులు చేసిన యంగ్ ఇండియా.. కంగారుల ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.

అండర్-19 ప్రపంచకప్‌లో 400 పరుగుల మార్కును అత్యధిక సార్లు దాటిన జట్టుగా భారత్ రికార్డులకెక్కింది. టీమిండియా మూడు సార్లు 400కు పైగా టోటల్స్‌ను నమోదు చేసింది.

అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్వహించే అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్. ఇది జాతీయ అండర్-19 జట్లచే పోటీ చేయబడుతుంది. యూత్ క్రికెట్ ప్రపంచ కప్‌గా 1988లో మొదటిసారి నిర్వహించగా 1998 వరకు మళ్లీ నిర్వహించలేదు. అప్పటి నుండి ఈ టోర్నమెంట్ ప్రతి రెండేళ్లకు నిర్వహించబడుతుంది, ఈ టోర్నమెంట్ ను గతంలో భారతదేశం రికార్డు స్థాయిలో ఐదు సార్లు ప్రపంచ కప్‌ను గెలుచుకోగా, ఆస్ట్రేలియా నాలుగు సార్లు, పాకిస్తాన్ రెండుసార్లు, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఒక్కోసారి గెలిచాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *